సిటీబ్యూరో, మే 7 (నమస్తే తెలంగాణ) : అమెరికాకు విమానంలో బయలుదేరిన ఇద్దరు దంపతులకు చేదు అనుభవం ఎదురైంది. దీంతో వారు వినియోగదారుల ఫోరాన్ని ఆశ్రయించారు. విశ్రాంత ఉద్యోగులైన రేణుక, రామకృష్ణ దంపతులు కొండాపూర్లో నివాసముంటారు. ఖతార్ ఎయిర్వేస్లో దోహా మీదుగా అమెరికాకు బయలుదేరారు. కాగా, బల్క్ హెడ్ సీట్ల (ఎక్స్ట్రా లెగ్ రూమ్) కోసం దరఖాస్తు చేసుకున్నారు. దీనికి బదులుగా ఒక మిడిల్ సీటుతో పాటు ఐసీఎల్ సీటు బుక్ చేశారు. అయితే మోకాలి శస్త్ర చికిత్స జరిగిన రామకృష్ణ ఈ సీట్లను చూసి షాక్కు గురయ్యారు. దీంతో పాటు ఆయనకు హృద్రోగ సమస్య ఉండటంతో ఇబ్బందులు పడ్డారు. సీటు సరిగా లేకపోవడంతో మెకాలి చిప్పలు వాచిపోయాయని, హైదరాబాద్-1 వినియోగదారుల ఫోరాన్ని ఆశ్రయించారు. వైద్య ధ్రువీకరణ పత్రాన్ని సమర్పించి, ఖతార్ ఎయిర్వేస్లో తాము సీట్లు కేటాయించలేదని ఫిర్యాదులో పేర్కొన్నారు. సుదీర్ఘంగా విచారించిన హైదరాబాద్-1 వినియోగదారుల ఫోరం అధ్యక్షురాలు బి. ఉమా వెంకట సుబ్బలక్ష్మి, గౌరవ సభ్యులు రామ్మోహన్లు బాధితులకు రూ.9,300 విలువైన రిటర్న్ ఫ్లైట్ చార్జిలు తొమ్మిది శాతం వడ్డీతో కలిసి చెల్లించాలని, బాధితులు మానసిక వేదన, అసౌకర్యానికి గురైనందుకు మరో రూ.25 వేలు, ఇతర ఖర్చుల కింద రూ.5వేలు 45 రోజుల్లో చెల్లించాలని ఆదేశాలు జారీ చేశారు.