సిటీబ్యూరో, జూలై 29 (నమస్తే తెలంగాణ): ఢిల్లీలో కార్లు దొంగిలించి వాటికి నకిలీ పత్రాలు తయారు చేసి హైదరాబాద్‌లో అమాయకులకు విక్రయిస్తున్న ముఠాను శంషాబాద్ ఎస్ఓటీ, రాజేంద్రనగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ముఠా నుంచి రూ.2.3 కోట్ల విలువైన 15 కార్లను స్వాధీనం చేసుకున్నారు. సైబరాబాద్ పోలీస్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర శుక్రవారం విలేరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు.
రాజేంద్రనగర్, అత్తాపూర్‌కు చెందిన మహ్మద్ అజార్ జావెద్ అలియాస్ మాము ఇంటర్ పూర్తి చేసి, 2016లో ఖాతర్‌కు వెళ్లాడు. అక్కడ తన సోదరి వద్ద ఉంటూ సూపర్‌మార్కెట్, రెస్టారెంట్లలో పనిచేసి 2020లో తిరిగి హైదరాబాద్‌కు వచ్చి ఉద్యోగాల కోసం ప్రయత్నించాడు. ఈ క్రమంలోనే ఓఎల్ఎక్స్లో తక్కువ ధరకు కారు అమ్ముతున్న ఓ ప్రకటన చూసి, అందులో ఉన్న నంబర్‌కు ఫోన్ చేశాడు.
ప్రకటన పెట్టిన ఢిల్లీకి చెందిన గులాం నబీ, అజార్‌తో మాట్లాడాడు. ఢిల్లీలో వారి వద్ద నుంచి ఇన్నోవా కారును రూ.4లక్షలకు కొనుగోలు చేసి నగరానికి తెచ్చి రూ.6.7 లక్షలకు విక్రయించడంతో మంచి లాభాలొచ్చాయి. దీంతో కొన్ని రోజుల పాటు అజార్ కార్ల కోసం గులాంనబీకి ఫోన్ చేస్తూ తక్కువ ధరకు కొనుగోలుచేసి హైదరాబాద్‌కు తెచ్చి విక్రయిస్తున్నాడు.
గులాంనబీ ఓ ఫార్చునర్ వాహనాన్ని రూ.2 లక్షలకు అజార్‌కు విక్రయించి, ఎన్ఓసీ వచ్చిన తరువాత మిగతా డబ్బు ఇవ్వాలనే షరతు పెట్టుకున్నాడు. దానికి ఎన్ఓసీ రాకపోవడంతో అజార్, గులాంను నిలదీశాడు. దీంతో తాను కార్లు దొంగిలించి, నకిలీ పత్రాలు తయారు చేసి విక్రయిస్తున్నట్లు అజార్‌కు చెప్పాడు.
నాలుగు నెలల కిందట అజార్, తన స్నేహితుడు ముజాహిద్‌లు ఢిల్లీకి వెళ్లి బ్రీజా, బెలోన కార్లను తీసుకొని నాగపూర్ మీదుగా హైదరాబాద్‌కు వస్తున్నారు. నాగపూర్‌లో పోలీసులు తనిఖీలు చేస్తుండటంతో ఇద్దరు కార్లు వదిలి పారిపోతుండగా, అందులో ముజాహిద్‌ను నాగపూర్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఇదిలాఉండగా సైబరాబాద్ పోలీసులకు ఈ ముఠా దందాపై సమాచారం రావడంతో అజార్, జహీర్, అమన్ఖాన్లను అరెస్ట్ చేశారు. ఢిల్లీకి చెందిన గులాంనబీ కోసం గాలిస్తున్నారు. 2ఇన్నోవా క్రిస్టా, 4హుందాయి క్రిట, 7బెలోన, 2బ్రీజా కార్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నాయి. వీరిపై ఢిల్లీలో 16 కేసులు నమోదయ్యాయి. ఈ సమావేశంలో డీసీపీ జగదీశ్వర్‌రెడ్డి, ఎస్ఓటీ డీసీపీ నారాయణ, రాజేంద్రనగర్ ఏసీపీ గంగాధర్ తదితరులు ఉన్నారు.
నీవు కార్లు దొంగిలించి ఇక్కడకు పంపించూ వాటిని మేము విక్రయించుకుంటామని గులాంనబీతో అజార్ ఒప్పందం చేసుకున్నాడు. ఈ దందాలో సహకారం కోసం అదే ప్రాంతానికి చెందిన మహ్మద్ జహీర్, మహ్మద్ అమన్ఖాన్లను తన ముఠాలో చేర్చుకున్నాడు. ఇక అప్పటి నుంచి గులాంనబీ కార్లు దొంగిలించి ఢిల్లీలో అజార్ ముఠాకు అప్పగిస్తాడు. వాటిని హైదరాబాద్‌కు తెచ్చి నకిలీ పత్రాలు సృష్టించి అమాయకులకు తక్కువ ధరకు విక్రయిస్తుంటారు.