సికింద్రాబాద్, జూలై 29: ఎట్టకేలకు రక్షణ మంత్రిత్వ శాఖ కంటోన్మెంట్ బోర్డు ఎన్నికలతో పాటు బోర్డు పరిధిలోని సమీప మున్సిపాలిటీల్లో విలీనం వంటి అంశాలపై అధికారికంగా ప్రకటన చేసింది. ఏడాదిన్నరగా రక్షణ మంత్రిత్వ శాఖ ఎలాంటి స్పష్టమైన ప్రకటన చేయకుండా, ఎన్నికలు నిర్వహించకుండా, విలీన ప్రతిపాదనలు చేయకుండా మీనమేషాలు లెక్కిస్తూ వస్తున్నది.
కంటోన్మెంట్ బోర్డులకు నిధులను కేటాయించకుండా, బకాయీల విడుదల ఊసే లేకుండా బోర్డులను నిర్వీర్యం చేసే విధంగా ముందుకు సాగుతూ, ప్రజలను ఇబ్బందుల పాల్జేసింది. ఈ క్రమంలో శుక్రవారం లోక్‌సభలో మహారాష్ట్రలోని రామ్‌టెక్ నియోజకవర్గానికి చెందిన ఎంపీ కృపాల్ బాలాజీ ప్రశ్నోత్తరాల సమయంలో అడిగిన ప్రశ్నకు రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ లిఖిత పూర్వక సమాధానం ఇచ్చారు. ది కంటోన్మెంట్స్ యాక్ట్ 2006లో సవరణలతో రూపొందించిన బిల్లు చివరి దశలో ఉందని తెలిపారు.
బోర్డు ఉపాధ్యక్షుడిని నేరుగా ఎన్నుకోవడంతో పలు అంశాలు ఈ బిల్లులో ఉన్నాయని వెల్లడించారు. ఈ నేపథ్యంలో నూతన బిల్లుకు పార్లమెంట్ ఆమోదం తర్వాతే ఎన్నికలు నిర్వహించే అవకాశముందని స్పష్టం చేశారు. ఇక కంటోన్మెంట్‌లోని సివిలియన్ ప్రాంతాలను వేరు చేసి, సమీప మున్సిపాలిటీల్లో విలీనం చేసే అంశంపై సంబంధిత రాష్టాలతో సంప్రదింపులు జరుపుతున్నామని పేర్కొన్నారు.
కంటోన్మెంట్ బోర్డుకు ఉపాధ్యక్షుడిని నేరుగా ఎన్నుకోవడం, సివిల్ ఏరియా కమిటీలను బలోపేతం చేయడం, ఉపాధ్యక్షుడికి ఆర్ధిక పరమైన అంశాల్లో అధికారాలు ఇవ్వడం, బోర్డు రాజ్యాంగంలో మార్పులు, బోర్డు నిర్ణయాలను మార్చే అధికారం వంటి అంశాలపై పలు ప్రతిపాదనలు వచ్చాయని తెలిపారు. వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకుని చర్యలు తీసుకుంటామన్నారు. కాగా, బిల్లు ఆమోదం పొందిన తరువాతే ఇది అమలు కానుంది.
గతంలో కంటోన్మెంట్ బోర్డు సభ్యులుగా ఎన్నికయ్యే వారికి బోర్డులో చెప్పుకోతగ్గ అధికారాలు ఉండేవి కాదు. కేవలం బోర్డు సమావేశాల్లో ప్రాతినిధ్యం వహించడం మినహా, బోర్డు సభ్యులకు అధికారికంగా ప్రత్యేక కార్యాలయం కూడా లేదు. అప్పట్లో ఉపాధ్యక్షుడికి సైతం బోర్డు సభ్యులతో పోలిస్తే ప్రత్యేక అధికారాలు ఏమీ లేకపోవడం గమనార్హం. తాజా చట్టం ప్రకారం, పాలనా సౌలభ్యం కోసం ఆర్థిక, విద్య, వైద్యం, సివిల్ ఏరియా వంటి ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేయనున్నారు.
అన్ని కమిటీల్లోనూ ఉపాధ్యక్షుడు కీలకం కానున్నారు. కంటోన్మెంట్ బోర్డు పరిధిలోని సివిలియన్ ప్రాంతాలను వేరుచేసి మున్సిపాలిటీల్లో విలీనం చేసే ప్రక్రియ వేగవంతం చేస్తున్నట్లు కేంద్రమంత్రి పార్లమెంట్లో ప్రస్తావించడంపై కంటోన్మెంట్ వికాస్ మంచ్ అధ్యక్షడు గడ్డం ఏబుల్, ప్రధాన కార్యదర్శి సంకి రవీందర్, ప్రభుగుప్త, శ్రీనివాస్, ఫాసి, శివకుమార్, గిరి, కృష్ణ హర్షం వ్యక్తం చేశారు.