గ్రేటర్లో వరుణుడు మళ్లీ ప్రతాపం చూపించాడు. శుక్రవారం సాయంత్రం గంటకుపైగా కురిసిన కుండపోత వర్షానికి ప్రధాన మార్గాలతోపాటు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పాఠశాలలు, కళాశాలలు, కార్యాలయాల నుంచి ఇండ్లకు చేరేవారు గంటల తరబడి ట్రాఫిక్‌లో చిక్కుకుపోయారు. విజయవాడ, వరంగల్ హైవేలపై వరద నిల్వడంతో వాహనాలు నెమ్మదిగా సాగాయి. అత్యధికంగా కీసరలో 10 సెం.మీ వర్షపాతం నమోదు కాగా, మరో 3 రోజులు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ అధికారులు తెలిపారు.
సిటీబ్యూరో, జూలై 29 (నమస్తే తెలంగాణ): నగరాన్ని వరుణుడు వదలడం లేదు.. కాస్త విరామం ఇచ్చినా.. శుక్రవారం మళ్లీ వర్షం దంచికొట్టింది. ఉత్తర, దక్షిణ ద్రోణికి తోడు ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో మధ్యాహ్నం 3 నుంచి 5 గంటల వరకు ఏకధాటిగా వాన పడింది. దీంతో రహదారులు జలమయమయ్యాయి. లోతట్టు ప్రాంతాల్లోని ఇండ్లలోకి నీరు చేరింది.
పాఠశాలలు, కళాశాలలు వదిలే సమయం కావడంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఇబ్బందులు పడ్డారు. సాయంత్రం వేళ ఉద్యోగులకు సైతం కష్టాలు తప్పలేదు. కీసరలో అత్యధికంగా 10.1 సెం.మీలు, ఇబ్రహీంపట్నంలో 9.7 సెం.మీ, నాంపల్లిలోని ఎల్బీ స్టేడియం వద్ద అత్యల్పంగా 1.0 సెం.మీల చొప్పున వర్షపాతం నమోదైనట్లు టీఎస్‌డీపీఎస్ అధికారులు వెల్లడించారు.
గ్రేటర్ సహా పొరుగు జిల్లాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో నగరంలోని జంట జలాశయాలైన ఉస్మాన్‌సాగర్, హిమాయత్సాగర్లకు వరద ప్రవాహం కొనసాగుతోంది. ఉస్మాన్‌సాగర్ ఎఫ్టీఎల్ 1790.00 అడుగులకు.. ప్రస్తుత నీటి మట్టం 1786.55లు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. రెండు గేట్లను 4 ఫీట్ల మేర పైకి ఎత్తామని, ఇన్‌ఫ్లో 600 క్యూసెక్కులు.. ఔట్ ఫ్లో 776 క్యూసెక్కులుగా కొనసాగుతున్నదన్నారు.
హిమాయత్‌సాగర్ పూర్తిస్థాయి నీటి మట్టం 1763.50 అడుగులకు.. ప్రస్తుతం 1760.80 అడుగులు ఉన్నట్లు వెల్లడించారు. ప్రస్తుతం ఒక గేటును ఫీటు ఎత్తి నీటిని కిందకు వదులుతున్నామన్నారు. ఇన్‌ఫ్లో 400 క్యూసెక్కులు, ఔట్ ఫ్లో 330 క్యూసెక్కులుగా కొనసాగుతున్నట్లు వివరించారు.
రాగల మూడు రోజులు గ్రేటర్‌లోని పలు చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు.. మరికొన్ని చోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశమున్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు.
మూసీ వరదలపై మూసీ రివర్‌ఫ్రంట్ డెవలప్మెంట్ తాజా అధ్యయనం చేయనున్నది. గండిపేట, హిమాయత్‌సాగర్‌ల నుంచి ఒకేసారి భారీ మొత్తంలో నీటిని కిందకు వదులుతుండడంతో మూసీలో పూర్తి స్థాయిలో వరద నీరు పారుతోంది.
దీంతో ఎంఆర్డీసీఎల్ ప్రస్తుతం వచ్చిన వరదలను అధ్యయనం చేస్తోంది. రెండు జలాశయాలతో పాటు హుస్సేన్‌సాగర్, ఇతర నాలాల నుంచి వరద నీరు వస్తున్న నేపథ్యంలో ఏ మేరకు ప్రవాహం ఉంటోంది..? బఫర్ జోన్ ఎంత వరకు నిర్ణయించారు..? భవిష్యత్‌లో ఇంత కన్నా ఎక్కువ వరద వచ్చినా.. ముంపునకు గురి కాకుండా ఎలాంటి చర్యలు తీసుకోవాలో తెలుసుకోనున్నారు. వరద ప్రవాహాన్ని ప్రత్యక్షంగా చూసి నివేదికను రూపొందించనున్నారు.
గ్రేటర్ పరిధిలో కురుస్తున్న వర్షాల నేపథ్యంలో విద్యుత్ శాఖ అప్రమత్తమైంది. ప్రతి రోజు విద్యుత్ సరఫరా తీరుపై దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ సీఎండీ జి.రఘుమారెడ్డి, డైరెక్టర్ ఆపరేషన్స్ జె.శ్రీనివాస్ రెడ్డి ఉన్నతాధికారులతో ఆడియో కాన్ఫరెన్స్ ద్వారా పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ఎలాంటి అత్యవసర పరిస్థితి ఉన్నా 1912/100/స్థానిక ఫ్యూజ్ ఆఫ్ కాల్ ఆఫీస్‌తో పాటు ప్రత్యేక కంట్రోల్ రూమ్ నం.7382072104, 7382072106, 7382071574లకు ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలని అధికారులు సూచించారు.