సికింద్రాబాద్, జూలై 29: సికింద్రాబాద్, కంటోన్మెంట్ ప్రాంతాల్లో సుమారు గంటన్నర పాటు భారీ వర్షం దంచి కొట్టింది. మధ్నాహ్నం వరకు ఎండ తీవ్రత ఉండగా, ఒక్కసారిగా వాతావరణం మారిపోవడంతో పాటు చినుకులతో మొదలైన వర్షం కంటోన్మెంట్లో కుండపోతగా కురిసింది. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయమవగా, కంటోన్మెంట్‌లోని ఆరో వార్డు సీతారాంపురంతో పాటు సాయిబాబా కాలనీ, శ్రీనివాస్‌నగర్ కాలనీ, భవానీ కాలనీల్లోని పలు ఇండ్లలోకి వరద నీరు చేరింది. మరోవైపు రామన్నకుంట చెరువు నిండుకుండలా మారి అలుగు పోస్తుంది. దీంతో స్థానిక కాలనీవాసులు ఆందోళనకు గురవుతున్నారు. రోడ్లపై నీళ్లు నిలిచి వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
పలు చోట్ల రోడ్లపై నీళ్లు చేరి ట్రాఫిక్ నిలిచిపోయింది. సికింద్రాబాద్, తిరుమలగిరి, సంగీత్ చౌరస్తాలో ట్రాఫిక్ జామ్ కావడంతో వాహనదారులు తీవ్ర ఇక్కట్లకు గురయ్యారు. మరోవైపు మ్యాన్‌హోల్స్ తెరవడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జీహెచ్ఎంసీ సూచించింది. భారీ వర్షం నేపథ్యంలో కంటోన్మెంట్ సిబ్బందితో పాటు సికింద్రాబాద్ పరిధిలో జీహెచ్ఎంసీ సహాయక చర్యలు చేపడుతోంది. కంటోన్మెంట్‌లోని న్యూబోయిన్‌పల్లి, కార్ఖానా, తిరుమలగిరి, మారేడ్‌పల్లి, రసూల్‌పురా, పికెట్‌తో పాటు సికింద్రాబాద్‌లోని బౌద్ధ్దనగర్, అడ్డగుట్ట, తార్నాక, మెట్టుగూడ, సీతాఫల్మండి డివిజన్లోని పలు బస్తీల్లోకి నీరు చేరడంతో జనం ఇబ్బందులు పడుతున్నారు.
నగరంలో కురిసిన భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాలను పరిశీలించి ప్రజలక భరోసా కల్పించేందుకు వర్షాన్ని సైతం లెక్కచేయకుండా హుటాహుటిన డీఆర్ఎఫ్ సిబ్బంది, జీహెచ్ఎంసీ అధికారులు, ఎలక్ట్రికల్ సిబ్బందితో కలిసి డిప్యూటీ మేయర్ మోతె శ్రీలతాశోభన్ రెడ్డి తార్నాక డివిజన్లోని లాలాపేట్ ప్రధాన నాలా వెంబడి పర్యటించారు.
ఈ సందర్భంగా నిలిచిన వర్షం నీరు, విరిగిన చెట్ల్లు, వంగిన స్తంభాలను తొలగించి రాకపోకలకు ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టారు. అనంతరం డిప్యూటీ మేయర్ మాట్లాడుతూ వర్షాలను దృష్టిలో ఉంచుకొని ప్రజలు ఎప్పుడు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అధికారులంతా ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంటు తగు చర్యలు తీసుకుంటారని తెలిపారు.
సికింద్రాబాద్:భారీ వర్షాల కారణంగా న్యూ బోయిన్‌పల్లిలోని రామన్నకుంట చెరువుకు భారీగా వరద రావడంతో శుక్రవారం సాయంత్రం చెరువు కట్ట తెగింది. దీంతో సమీప కాలనీలు సౌజన్య కాలనీ, శ్రీనివాస్‌నగర్, భవానీనగర్, సీతారాంపురంతో పాటు పలు బస్తీలు, కాలనీలు జలమయమయ్యాయి. కాలనీలను ముంచెత్తాయి. అప్రమత్తమైన కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జక్కుల మహేశ్వర్‌రెడ్డి, బోర్డు మాజీ సభ్యుడు పాండుయాదవ్‌లు తక్షణ చర్యలకు ఉపక్రమించారు.