సిటీబ్యూరో, మే 2 (నమస్తే తెలంగాణ): ఆన్లైన్లో క్రిప్టో కరెన్సీ ద్వారా తమ కంపెనీలో పెట్టుబడులు పెడితే తక్కువ సమయంలోనే అధిక రాబడి వస్తుందని నమ్మించి, ఎంతో మంది బాధితుల నుంచి కోట్ల రూపాయలు కొల్లగొట్టిన అంతర్జాతీయ సైబర్ మోసగాళ్ల నుంచి సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు రూ.2.68కోట్లను తిరిగి రాబట్టడంతో పాటు కోర్టు ఆదేశాల మేరకు బాధితులకు రిఫండ్ చేశారు.
పోలీసుల కథనం ప్రకారం… నగరానికి చెందిన ఒక బాధితుడు వాట్సాప్ ద్వారా వచ్చిన ‘ఎంసీ-వీఐపీ-బీటీసీ-గ్రూప్-888/702’ మెసేజ్‌కు ప్రతిస్పందించాడు. సదరు ఎంసీ-వీఐపీ గ్రూప్ అనే బోగస్ సంస్థ తమ కంపెనీలో ఆన్‌లైన్‌ద్వారా పెట్టుబడి పెడితే రెట్టింపు రాబడి వస్తుందని నమ్మించడంతో బాధితులు లక్షలు, కోట్లలో పెట్టుబడులు పెట్టారు. తీరా వారికి ఎలాంటి రాబడి రాకపోవడంతో మోసపోయినట్లు గ్రహించిన బాధితులు సైబరాబాద్ సైబర్‌క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేయగా బాధితులకు సంబంధించిన కొంత డబ్బు ఆఫ్రికాలోని అంతర్జాతీయ క్రిప్టో కరెన్సీ ఎక్స్ఛేంజ్లో జమ ఉన్నట్లు గుర్తించారు. ఈ మేరకు సైబరాబాద్ సైబర్‌క్రైమ్ పోలీసులు జరిగిన మోసాన్ని, బాధితుల వివరాలను వివరిస్తూ సదరు క్రిప్టో కరెన్సీ ఎక్స్ఛేంజ్కు నోటీసు పంపారు. స్పందించిన ఎక్సైజ్ అధికారులు అక్కడ జమ ఉన్న డబ్బును ఫ్రీజ్ చేశారు. ఈ మేరకు కేసు దర్యాప్తు చేస్తున్న సైబర్‌క్రైమ్ పోలీసులు కోర్టు ఆదేశాల మేరకు డబ్బులను బాధితులకు రిఫండ్ చేశారు.