Sajjanar | ఆహార కల్తీపై హైదరాబాద్ ఫుడ్ అడల్టరేషన్ సర్వైలెన్స్ టీమ్ ఉక్కుపాదం మోపుతోంది. మార్చి 19వ తేదీన ఏర్పాటైన హెచ్-ఫాస్ట్ టీమ్.. జీహెచ్ఎంసీ, ఫుడ్ సేఫ్టీ, వెటర్నరీ విభాగాల అధికారులతో సమన్వయం చేసుకుంటూ ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తోంది. ఈ క్రమంలోనే 100 రోజుల్లో నగరవ్యాప్తంగా వివిధ జోన్ల పరిధిలో మొత్తం 185 కేసులు నమోదు చేసింది. సుమారు 121.87 టన్నుల ప్రమాదకరమైన కల్తీ ఆహార పదార్థాలను స్వాధీనం చేసుకుంది. జోన్ల వారీగా పరిశీలిస్తే అత్యధికంగా రాజేంద్రనగర్ జోన్లో 55 కేసులు నమోదు కాగా, గోల్కొండ జోన్లో 44, సికింద్రాబాద్ జోన్లో 35, చార్మినార్ జోన్లో 21, శంషాబాద్ జోన్లో 13, జూబ్లీహిల్స్ జోన్లో 12, ఖైరతాబాద్ జోన్లో 5 కేసులు నమోదయ్యాయి.
నిత్యం వాడే కల్తీ అల్లం వెల్లుల్లి పేస్ట్‌కు సంబంధించి 27 కేసుల్లో ఏకంగా 27,024.7 కేజీల నకిలీ నిల్వలను పోలీసులు పట్టుకున్నారు. కృత్రిమ రసాయనాలతో పండ్లను మగ్గబెట్టే 16 ముఠాల గుట్టురట్టు చేసి 25,845 కేజీల పండ్లను సీజ్ చేశారు. చికెన్ వ్యర్థాల విక్రయాలకు సంబంధించిన 6 కేసుల్లో ఏకంగా 60 టన్నుల కంటే ఎక్కువ చికెన్‌ను స్వాధీనం చేసుకోవడం గమనార్హం. వీటితో పాటు 3 కేసుల్లో 9,260 కేజీల నిల్వ పచ్చళ్లు, 4 కేసుల్లో 4,030 కేజీల కల్తీ కోవా, 7 కేసుల్లో 3,897 కేజీల నకిలీ టీ పొడి, సుమారు 15 టన్నుల నాణ్యత లేని చికెన్/మాంసం (12 కేసులు), 3,260 కేజీల కల్తీ క్రీమ్, 530 కేజీల కల్తీ నెయ్యి (1 కేసు), సుమారు 2,706 కేజీల నాణ్యత లేని డ్రై ఫ్రూట్స్/ఖర్జూరం (2 కేసులు), 2,500 కేజీల కల్తీ పెరుగు (1 కేసు), 1,514 కేజీల కల్తీ పనీర్ (5 కేసులు), ఫాస్ట్ ఫుడ్ సెంటర్లలో 120 కేజీల నాణ్యత లేని ఫ్రైడ్ చికెన్ (2 కేసులు) స్వాధీనం చేసుకున్నారు. ఐస్ క్రీములు, బిస్కెట్లు, ఆర్ఓ వాటర్ ప్లాంట్లు, జంక్ ఫుడ్స్ వంటి ఇతర విభాగాల్లో 34 కేసులు నమోదయ్యాయి.
పోలీసు చర్యలతో పాటు జీహెచ్ఎంసీ ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్స్(ఎఫ్ఎస్ఓ)లకు తదుపరి చర్యల నిమిత్తం 247 కేసులు అప్పగించారు. ఇందులో అత్యధికంగా పనీర్ అవుట్లెట్లపై 70 కేసులు, ప్రజల నుంచి నేరుగా వచ్చిన ఫిర్యాదులపై 90 కేసులు నమోదు చేశారు. అలాగే సమోసా తయారీ కేంద్రాలపై 11, వాటర్ ప్యాకింగ్ ప్లాంట్లపై 9, మసాలాలు/స్పైసెస్ పై 7, బేకరీలు, ఫాస్ట్ ఫుడ్ కేంద్రాలపై చెరో 6 కేసులు, జెప్టోపై 5, హాస్టళ్లు, మాంసం దుకాణాలపై చెరో 4 కేసులు, ఐస్ తయారీ కేంద్రాలపై 3, చికెన్ వేస్ట్/సీ ఫుడ్‌పై 3 కేసులు దాఖలయ్యాయి.
సమాజం ఎదుర్కొంటున్న అతిపెద్ద సవాలు ఆహార కల్తీ అని హైదరాబాద్ సీపీ సజ్జనార్ తెలిపారు. ప్రజల కిడ్నీలను పాడుచేస్తూ, క్యాన్సర్, గుండె జబ్బుల వంటి తీవ్రమైన వ్యాధులను పంచుతూ సామాన్యుల జీవితాలతో చెలగాటం ఆడుతున్న్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది ప్రజల ఆరోగ్యంతో, అమాయకుల ప్రాణాలతో ఆడుకునే ఒక ఘోరమైన హత్యాయత్నం అని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రజల నమ్మకాన్ని వమ్ము చేస్తూ వారి ప్రాణాలు హరించే కల్తీ మాఫియాపై పీడీ యాక్ట్ ప్రయోగించడానికి కూడా వెనుకాడబోమని హెచ్చరించారు.
ఆహార కల్తీ మహమ్మారిని అరికట్టడంలో పౌరుల భాగస్వామ్యం అత్యంత కీలకమని సజ్జనార్ పిలుపునిచ్చారు. పరిసరాల్లో ఎక్కడైనా ఆహార పదార్థాల కల్తీ జరుగుతున్నట్లు అనుమానం వచ్చినా, లేదా అపరిశుభ్ర వాతావరణంలో ఆహారం తయారు చేస్తున్నట్లు తెలిసినా ఏమాత్రం సంకోచించకుండా వెంటనే డయల్ 100కి గానీ, హెచ్-ఫాస్ట్ నంబర్ 8712661212కు వాట్సాప్ లేదా ఫోన్ ద్వారా సమాచారం అందించాలని విజ్ఞప్తి చేశారు. సమాచారం అందించిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామన్నారు. సురక్షిత, ఆరోగ్యవంతమైన హైదరాబాద్ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఆకాంక్షించారు.