సిటీబ్యూరో, జనవరి 2 (నమస్తే తెలంగాణ): ప్రీమియం చెల్లించి బీమా తీసుకుంటే.. ఎందుకు వర్తింపజేయరని హెచ్డీఎఫ్సీ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీకి హైదరాబాద్ వినియోగదారుల కమిషన్ ప్రశ్నించింది. ప్రమాద బీమా కింద నిబంధనల ప్రకారం రూ.15 లక్షలు చెల్లించాలని కమిషన్-1 అధ్యక్షురాలు బి.ఉమావెంకట సుబ్బలక్ష్మి, సభ్యులు సి.లక్ష్మీప్రసన్న, శాసనకోట మాధవిలతో కూడిన బెంచ్ ఆదేశించింది.
నిజాంపేట్ మున్సిపాలిటీ పరిధిలోని ప్రగతినగర్‌కు చెందిన బట్టు మల్లికార్జున 2019లో హ్యూందాయ్ గ్రాండ్ ఐ10 స్పోర్ట్స్ మోడల్ కారును కొనుగోలు చేశారు. కాగా, వ్యక్తిగత ప్రమాదబీమా కోసం రూ.33,896 ప్రీమియం చెల్లించి పాలసీని పొందారు. అయితే, 2021 జూన్ 20న హైదరాబాద్ నుంచి కడపకు వెళ్తున్న క్రమంలో వనపర్తి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఇందులో కారు యజమాని మృతి చెందగా, కుమారుడికి తీవ్రగాయాలయ్యాయి. ఆయన కోలుకున్న అనంతరం తన తల్లి (కారు యజమాని)మరణ ధ్రువీకరణ పత్రంతోపాటు అన్ని డాక్యుమెంట్లను ఇన్సూరెన్స్ కంపెనీకి సమర్పించారు.
కాగా, సంబంధిత కంపెనీ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ.. ఎలాంటి సమాచారం ఇవ్వకుండా దాటవేత ధోరణిని అవలంభించారు. పైగా ఫిర్యాదుదారుడు థర్డ్‌పార్టీ కిందకు వస్తాడని నిరాకరించింది. ఏడాది గడిచినా ఎలాంటి స్పందన లేకపోవడంతో బాధితుడు వినియోగదారుల కమిషన్‌ను ఆశ్రయించాడు. కేసు పూర్వాపరాలు పరిశీలించిన కమిషన్.. నిబంధనల ప్రకారం రూ.15 లక్షల బీమాను చెల్లించాల్సిందేనని ఆదేశించింది. దీంతో బాధితులను ఇబ్బందులకు గురిచేసినందుకు నష్టపరిహారంగా రూ.10వేలు, రూ.10వేలు కోర్టు ఖర్చుల కింద చెల్లించాలని ఆదేశించింది.