శేరిలింగంపల్లి, జూలై 18: ఒకేరోజు ఐదు వరుస చైన్‌స్నాచింగ్‌లకు పాల్పడిన చైన్‌స్నాచింగ్ ముఠాను సైబరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. వారివద్ద నుంచి రూ. 5 లక్షల విలువజేసే 8 తులాల బంగారు గొలుసులు, ఒక పల్సర్ బైక్ స్వాధీనం చేసుకున్నారు. మాదాపూర్ డీసీపీ కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డీసీపీ కె.శిల్పవల్లి వివరాలు వెల్లడించారు. మహారాష్ట్ర జోగేశ్వరీ ప్రాంతం ప్రేమ్‌నగర్‌కు చెందిన ఆటోట్రైవర్ అంజాద్ ఇక్బాల్ షేక్ అలియాస్ అంజాద్ షేక్(36), స్విగ్గీ డెలివరీ బాయ్ నూరైన్ షౌకత్ హుసేన్ ఖాన్(34), ముంబైకి చెందిన ఎంబ్రయిడరీ పనిచేసే తన్వీర్‌ఖాన్(36) స్నేహితులు. సులువుగా డబ్బు సంపాదించేందుకు దొంగతనాలు ప్రారంభించారు. మహారాష్ట్రతో పాటు తెలంగాణలో ఈ ముగ్గురు వివిధ చోరీ కేసుల్లో నిందితులు. అంజాద్ ఓ లైంగికదాడి కేసుతోపాటు 14 కేసుల్లో నిందితుడు. తన్వీర్‌ఖాన్ అఫ్జల్‌గంజ్‌లో ఓ చోరీ కేసులో నిందితుడు. షౌకత్ హుసేన్, మహారాష్ట్ర థానే ప్రాంతానికి చెందిన విజయ్ కమల్‌కాంత్ యాదవ్ ఓ మర్డర్ కేసులో నిందితులని డీసీపీ తెలిపారు.
అంజాద్, షౌకత్ కలిసి ఈనెల 13న ఆర్సీపురం పరిధిలో పార్క్‌చేసి ఉన్న పల్సర్ బైక్‌ను తన్వీర్‌ఖాన్ సహాయంతో దొంగలించారు. ఆ బైక్‌పై నగరంలోకి ప్రవేశించిన అంజాద్, షౌకత్ మియపూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో మహిళ మెడలో నుంచి గొలుసు దొంగతనానికి యత్నించి విఫలమయ్యారు. ఆ తర్వాత చందానగర్ పరిధిలోని కోట సుబ్బరత్నమ్మ మెడలోంచి 5 తులాల బంగారు గొలుసును తెంచుకొని వెళ్లిపోయారు. సాయంత్రం సంగారెడ్డి రూరల్ పోలీస్‌స్టేషన్ పరిధిలో మరో మహిళ మెడలో చైన్ స్నాచింగ్‌కు యత్నించి విఫలమయ్యారు. రాత్రి తిరిగి మియాపూర్ పరిధిలో ఓ మహిళ మెడలోంచి 25 గ్రాముల బంగారు తాళిబొట్టును లాక్కొని పరారయ్యారు. బాధితురాలు సుబ్బరత్నమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. సీసీ ఫుటేజీ ఆధారంగా దర్యాప్తు చేపట్టారు. నిందితులు మహారాష్ట్రకు చెందిన వారిగా గుర్తించి, అంజాద్, షౌకత్, విజయ్ కమల్ కాంత్ యాదవ్‌ను అరెస్టు చేశారు. సంగారెడ్డిలో తన్వీర్ఖాన్ను అరెస్టు చేశారు. సమావేశంలో మాదాపూర్ అడిషనల్ డీసీపీ నంద్యాల నర్సింహారెడ్డి, మాదాపూర్ ఏసీపీ శ్రీనివాస్, మియాపూర్ ఏసీపీ నరసింహారావు, చందానగర్ ఇన్స్పెక్టర్ పాలవెల్లి, మాదాపూర్ సీసీఎస్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్‌రావు పాల్గొన్నారు.