
సిటీబ్యూరో, ఆగస్టు 30 (నమస్తే తెలంగాణ) : ఆత్మీయ బంధాల్లో హైదరాబాదీలు అగ్రస్థానంలో నిలిచారు. కరోనా మహమ్మారితో ఒంటరితనం, ఆందోళన చాలా మందిలో పెరిగిపోయింది. ఈ కాలంలో బాగా సన్నిహితమైన వారి మద్దతు కోసం ఆరాటపడటమూ కనిపించింది. ఇదే విషయాన్ని మై గేట్ ట్రస్ట్ సరిల్ అధ్యయనంలో వెల్లడించింది. నగరంలో దాదాపు అందరూ (100 శాతం) ఆత్మీయ బంధాలు నిర్మించుకోవడం ద్వారా మాత్రమే ఒత్తిడి, ఆందోళన నుంచి ఉపశమనం పొందామని అభిప్రాయపడ్డారు. కొచ్చిలో ఇది 74. 55%గా ఉంటే, చెన్నైలో 60%గా ఉంది.
కరోనా మానసికంగా ప్రతి ఒక్కరినీ విపరీతంగా కుంగదీసింది. విధ్వంసకర స్థాయిలో మొత్తం 80%కు పైగా ప్రభావం చూపించగా, ఇందులో పురుషుల్లో అత్యధికంగా (90%) కనబడితే, ఆ తరువాత స్త్రీలు (90%) కనిపించిందని నివేదికలో పేర్కొనది. నగరంలో లాక్డౌన్ సమయంలో చుట్టు పకల వారితో సహా తమ వాచ్‌మన్ , డెలివరీ బాయ్స్ , పని మనుషులతో కూడా ఆత్మీయత పెరిగిందని, హైదరాబాదీలు ఇప్పుడు తమకు ఏదైనా సహాయం కావాల్సి వస్తే చుట్టు పకల వారిని అడిగేందుకు సందేహించడం లేదని ‘మైగేట్’ స్పష్టం చేసింది.
అలాగే హైదరాబాద్‌లో ప్రస్తుతం 39.11% మంది తమ ఇంటి తాళాలను తమ సెక్యూరిటీ గార్డ్‌కు ఇవ్వడానికి అభ్యంతరం లేదంటున్నారు. అంతేకాదు, బెంగళూరు (81.45%) తరువాత తమ సెక్యూరిటీ సిబ్బందికి మహమ్మారి సమయంలో హైదరాబాదీ (79.44%) తోడ్పడ్డారు. మనమంతా కష్టకాలం ఎదురొన్నామని మైగేట్ సీవోవో అండ్ కో-ఫౌండర్ అభిషేక్ కుమార్ అన్నారు. ఇతర దక్షిణ భారత నగరాలతో పోలిస్తే హైదరాబాదీలు నిజమైన బంధాలను కోరుకుంటున్నారని తెలిపారు.