సిటీబ్యూరో, జూన్ 24(నమస్తే తెలంగాణ): సికింద్రాబాద్ మోండా మార్కెట్లో ఇటీవల జరిగిన దోపిడీ కేసును సౌత్ జోన్ పోలీసులు చాకచక్యంగా ఛేదించి నిందితులను అరెస్ట్ చేశారు. మంగళవారం సికింద్రాబాద్‌లోని సౌత్‌జోన్ డీసీపీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో సౌత్‌జోన్ డీసీపీ రశ్మిపెరుమాల్ వివరాలను వెల్లడించారు. ఈనెల 18న మోండా మార్కెట్లో జ్యువెలరీ షాపు యజమాని హరిరామ్ అనే వ్యక్తిని ఓ నకిలీ బంగారం ముఠా మోసం చేసి దోపిడీకి పాల్పడింది.
దోపిడీ ముఠాలో 18మందిని అరెస్ట్ చేయగా నిందితుల్లో కొండాపూర్ 8వ బెటాలియన్‌కు చెందిన కానిస్టేబుల్ కేశవ్ పట్టుబడినట్లు తెలిపారు. మార్కెట్ రేటు కంటే 5శాతం తక్కువ ధరకే బంగారం ఇస్తామంటూ 1కేజీ బంగారం కొనుగోలుకు రాధేశ్యామ్ అనే వ్యక్తి ఒప్పందం కుదుర్చుకున్నాడని, దీనికి నగదు రూపంలోనే డబ్బులు ఇవ్వాలని చెప్పినట్లు తెలిపారు.
మొత్తం పదిహేను మంది గ్రూపు అదే రోజు బ్లూసీ హోటల్లో సమావేశమై దోపిడీకి సంబంధించిన ప్రణాళికను రచించారని , ఆ తర్వాత హరిరామ్‌కు సంబంధించిన కార్యాలయానికి వెళ్లి అక్కడ క్యాష్ చెక్ చేస్తుండగా నలుగురు వ్యక్తులు వచ్చి అందులో కేశవ్ అనే వ్యక్తి తాను ఎస్ఓటీ పోలీసు అంటూ ఐడీ కార్డు చూపించి వారి దగ్గర ఉన్న క్యాష్‌బ్యాగ్, సెల్ఫోన్లను తీసుకుని అక్కడి నుంచి వెళ్లిపోయి క్యాష్‌బ్యాగ్‌ను రాంబాబు అనే వ్యక్తికి అప్పగించారు.
ఆ తరవాత భాను అనే వ్యక్తి బైక్‌పై వెళ్తున్న రాంబాబును తిరుమలగిరి దగ్గర నలుగురు వ్యక్తులు వెహికల్ సీజర్ టీమ్ పేరుతో వచ్చి భాను తన వెహికల్‌పై ఈఎంఐ బాకీ ఉన్నాడంటూ చెప్పి అతడి దగ్గరున్న బ్యాగు నుంచి డబ్బులు తీసుకుని పరారయ్యారు. మొత్తం ఈ వ్యవహారం ప్రధాన నిందితులు ఇద్దరిని గోవాలో అదుపులోకి తీసుకోగా, కేసుతో సంబంధమున్న మరికొంతమందిని కర్ణాటకలో అరెస్ట్ చేశారు.
ఈ కేసులో మొత్తం 28 మంది నిందితులు ఉండగా, 10 మంది పరారీలో ఉన్నట్లు డీసీపీ తెలిపారు.చోరీ చేసిన మొత్తం డబ్బును వివిధ మార్గాల ద్వారా తరలించి పోలీసుల దృష్టిని మళ్లించడానికి నిందితులు ప్రయత్నం చేశారు. సీసీ కెమెరాలు, సెల్‌ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా నిందితులను అరెస్ట్ చేశామని, ఇందులో రెండు క్రిమినల్ గ్రూప్స్ భాగస్వామ్యం ఉన్నట్లు తమ విచారణలో తేలిందని, ఇందులో ఒకటి నకిలీ బంగారం టీమ్ కాగా మరొకటి వెహికల్ సీజర్ టీమ్ అని డీసీపీ తెలిపారు. నిందితుల నుంచి రూ.43 లక్షల నగదు, 57.193 గ్రాముల బంగారు ఆభరణాలు, రెండు కార్లు, నాలుగు బైక్‌లు, 23సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.