మెహిదీపట్నం జూలై 26: హౌసింగ్ బోర్డుకు బకాయి పడ్డ డబ్బులను చెల్లించకపోవడంతో ఫంక్షన్ హాల్‌ను సీజ్ చేయడానికి వచ్చిన ఓ అధికారి మృతి చెందిన ఘటన కలకలం రేపింది. వివరాల్లోకి వెళితే.. మెహిదీపట్నం ఆర్టీసీ డిపో ముందు ఎంపీ గార్డెన్ ఫంక్షన్ హాల్ ఉంది. ఈ ఫంక్షన్ హాల్‌ను హౌసింగ్ బోర్డు నుంచి లీజుకు తీసుకుని ఇషాక్ ఉద్దీన్ నడుపుతున్నాడు.
2018 నుంచి అద్దె చెల్లించకుండా ఫంక్షన్ హాల్ నిర్వహిస్తున్నాడు. సుమారు రూ. కోటి 22 లక్షలు హౌసింగ్ బోర్డుకు బకాయి ఉన్నాడు. దీంతో హౌసింగ్ బోర్డు అధికారులు కోర్టు నుంచి ఆర్డర్ తీసుకుని ఫంక్షన్ హాల్‌ను సీజ్ చేయడానికి రావడంతో ఇషాక్ ఉద్దీన్ తన సహచరులతో అధికారులతో వాగ్వాదానికి దిగాడు. తోపులాటలో హౌసింగ్ బోర్డు ఏఈఓ జగదీశ్వర్ రావు (52) స్పృహ తప్పి పడిపోయాడు. వెంటనే ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ చనిపోయాడు.
హౌసింగ్ బోర్డు అధికారులు ఫంక్షన్‌హాల్‌ను సీజ్ చేసి వెళ్లిపోయారు. పోలీసులు బందోబస్తు సరిగా ఇవ్వలేదని బోర్డు అధికారులు మండిపడుతున్నారు. జగదీశ్వర్ రావు మృతదేహానికి ఉస్మానియా మార్చురీలో పోస్టుమార్టం నిర్వహించి కుటుంబసభ్యులకు అప్పగించారు. కోర్టు బేలీఫ్ ఫిర్యాదుతో ఆసిఫ్‌నగర్ ఏసీపీ కిషన్ కుమార్ పర్యవేక్షణలో ఇన్స్పెక్టర్ ఆనంద్ కేసును దర్యాప్తు చేస్తున్నారు.