సిటీబ్యూరో, మే 28 (నమస్తే తెలంగాణ): ప్రకృతి ప్రకోపంతో విద్యుత్ వ్యవస్థ ధ్వంసమైంది. విద్యుత్ సరఫరాను పునరుద్ధరించడమే లక్ష్యంగా పెట్టుకొని విద్యుత్ శాఖ అధికార యంత్రాంగం మొత్తం అందులోనే నిమగ్నమై రాత్రి, పగలు అనే తేడా లేకుండా పనిచేస్తోంది. ఇదంతా ప్రత్యక్షంగా చూస్తున్న స్థానికులు తాము సహకారం అందిస్తామంటూ వారికి అండగా నిలిచారు. రెండు రోజుల కిత్రం సరూర్నగర్ సర్కిల్ పరిధిలోని హయత్నగర్, ఎల్బీనగర్, వనస్థలిపురం ప్రాంతాల్లో గాలివాన దుమారానికి చాలా చోట్ల చెట్లు కూలి విద్యుత్ లైన్లు, స్తంభాలపై పడిపోయాయి. దీంతో గంటల తరబడి సరఫరా నిలిచిపోయి అంధకారం నెలకొంది. సరూర్నగర్ ద్వారకామయి నగర్ కాలనీలోని రోడ్లపై చెట్లు కూలి.. కొమ్మలు 11కేవీ స్తంభాలు, ఎల్టీ లైన్ స్తంభాలపై పడిపోవడంతో దాదాపు ఒక కిలో మీటర్ నిడివి గల కండక్టర్ ధ్వంసమైందని సర్కిల్ విద్యుత్ శాఖ అధికారి తెలిపారు. దీనికి తోడు హెచ్జీ ప్యూజ్ సెట్, ఏబీ స్విచ్ సెల్ పూర్తిగా ధ్వంసమై సుమారు 300 వినియోగదారుల సర్వీసు వైర్లు ఎక్కడికక్కడ తెగిపోయాయి. వీటన్నింటినీ పునరుద్ధరించేందుకు విద్యుత్ శాఖ యంత్రాంగం శ్రమిస్తున్న సమయంలో కాలనీవాసులు ముందుకొచ్చి విద్యుత్ శాఖ సిబ్బందికి సహకారం అందించారు. కాలనీ సంక్షేమ సంఘం ప్రతినిధులు అక్కడ పనిచేస్తున్న సిబ్బందికి అల్పాహారం, భోజన ఏర్పాట్లు చేశారు. ఇలాంటి సహకారం గ్రామాల్లోనే విద్యుత్ శాఖ ఉద్యోగులకు ఉంటుందని, ఇది హైదరాబాద్లో జరగడం అరుదైన సంఘటన అని విద్యుత్ శాఖ అధికారులు తెలిపారు.