Namaste Effect | సిటీబ్యూరో, అక్టోబర్ 18 (నమస్తే తెలంగాణ): జీహెచ్ఎంసీ టౌన్ ప్లానింగ్‌లో ‘బిగ్ బ్రదర్స్’ పేరిట జరుగుతున్న దందాపై ఉద్యోగుల్లో హాట్ హాట్ చర్చ జరిగింది. శేరిలింగంపల్లి సర్కిల్‌కు చెందిన చైన్‌మెన్ అక్రమ వసూళ్లకు పాల్పడుతూ రూ. కోట్లకు పడగలెత్తాడు. అక్రమ నిర్మాణాలను లక్ష్యంగా చేసుకుని అందినంత దండుకుంటూ సర్కిల్లో విచ్చలవిడిగా అవినీతికి తెరలేపాడు. సంస్థ పరమైన లోపాలను ఆసరాగా చేసుకొని అక్రమాలకు పాల్పడ్డాడు. రాఘవేంద్ర కాలనీ, రాజరాజేశ్వరీనగర్, అంజయ్య నగర్, సిద్ధిఖ్నగర్లో ఈ చైన్‌మెన్ బాధితుల్లో కొందరు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసిన సందర్భాలున్నాయి. ఈ క్రమంలోనే ఇటీవల మాదాపూర్ కాపూరి హిల్స్ ఫేజ్- 2 రోడ్డులోని దాదాపు 1000 గజాల స్థలంలో ఓ వ్యాపారస్తుడు సెకండ్ హ్యాండ్ కార్ సేల్స్ వ్యాపారానికి షెడ్డు వేసుకునేందుకు ప్రయత్నించగా…ఈ వ్యాపారస్తుడి వద్దకు జేసీబీతో వచ్చి హల్చల్ చేసి రూ.30 లక్షలు డిమాండ్ చేసిన చైన్‌మెన్..చివరకు రూ.10 లక్షలకు బేరం కుదుర్చుకుని ఆ నిర్మాణం జోలికి వెళ్లలేదు.
దీనిపై శుక్రవారం ‘నమస్తే తెలంగాణ’లో ‘బిగ్ బ్రదర్స్ పేరిట చక్రం తిప్పుతున్న చైన్‌మెన్ వ్యవహారంపై ప్రత్యేక కథనాన్ని ప్రచురించగా…స్పందించిన శేరిలింగంపల్లి జెడ్సీ ఉపేందర్‌రెడ్డి జోన్ టౌన్‌ప్లానింగ్ అధికారులు, సిబ్బందితో ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. టౌన్ ప్లానింగ్ విభాగంలో కొందరు తీరుతో చెడ్డ పేరు వస్తుందని, పనితీరు మార్చుకోవాలని జెడ్సీ మందలించారు. చైన్‌మెన్ వ్యవహారాలను నిగ్గు తేల్చాలంటూ డీసీ ముకుందరెడ్డి, ఏసీపీ రమణ కుమార్‌లను ఆదేశించారు. శనివారం(నేటి)లోగా విచారణ పూర్తి చేసి నివేదిక ఇవ్వాలని విచారణ అధికారులను జెడ్సీ ఆదేశించారు. కాగా, మాదాపూర్ కాపూరి హిల్స్ ఫేజ్- 2 రోడ్డులోని దాదాపు 1000 గజాల స్థలం విషయంలో అక్రమ నిర్మాణం ఎవరు కట్టారు? ఇందులో ఎవరెవరి ప్రయేయం ఉందని నిగ్గు తేల్చేందుకు విచారణాధికారులు శనివారం ఉదయం సంబంధిత ప్రాంతాన్ని సందర్శించనున్నారు. వివిధ అంశాలపై ఆరా తీయనున్నారు.