సిటీబ్యూరో, ఏప్రిల్ 19(నమస్తే తెలంగాణ): భూములను భారీగా సమీకరిద్దాం… మౌలిక వసతులు కల్పిద్దాం. ఇక వాటిని లే అవుట్లుగా అభివృద్ధి చేసి సొమ్ము చేసుకుందామనే మార్కెటింగ్ స్ట్రాటజీతో హెచ్ఎండీఏ రూపొందించిన వ్యూహం బెడిసికొట్టింది. భూములు ఇచ్చే వారు లేకపోవడంతో ల్యాండ్ పూలింగ్ స్కీం నీరుగారిపోతున్నది. వాటా విషయంలోనే రైతులు, హెచ్ఎండీఏ మధ్య సయోధ్య లేకపోకుండాపోయింది. దీంతో గ్రామ సభల్లోనే రైతులు భూములు ఇవ్వలేమని తేల్చి చెప్పేశారు.
ఖజనా నింపుకొనేందుకు హెచ్ఎండీఏ ల్యాండ్ పూలింగ్ పథకానికి తెరలేపింది. మోకీల మండలం, శంకర్పల్లి గ్రామంలో దాదాపు 456 ఎకరాలు, ఘట్ కేసర్ మండల పరిధిలోని ప్రతాప సింగారం, కొర్రెముల్లా గ్రామాల పరిధిలో మరో 1000 ఎకరాల భూములను సేకరించేలా ప్రణాళికలను రచించింది. రైతుల నుంచి నిరభ్యంతర పత్రాలను కూడా స్వీకరించింది. ఇప్పుడు భూములు ఇచ్చేందుకు ముందుకు వచ్చిన రైతులే… అభ్యంతరం వ్యక్తం చేస్తుండటంతో ల్యాండ్ పూలింగ్ సందిగ్ధంలో పడింది.
భూముల ధరలు విపరీతంగా పెరగడం, కమర్షియల్ యాక్టివిటీ విస్తరించడంతోనే హెచ్ఎండీఏ ఇచ్చే పరిహారం తక్కువగా ఉందని రైతులు భావిస్తున్నారు. అభివృద్ధి చేసిన 70 శాతం భూమిని తమకే ఇవ్వాలని, ప్రతాపసింగారంలో గ్రామసభలో రైతులు అభిప్రాయం వ్యక్తం చేసినట్లు తెలిసింది.మార్కెట్ ధరతో పోల్చితే తక్కువ ఉందని చాలా మంది రైతులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. హెచ్ఎండీఏ ఇచ్చే నిష్పత్తి 60: 40 ఉంటుందని, దీంతోపాటు పూర్తి స్థాయిలో డెవలప్ చేసిన ప్లాట్లు అందుబాటులోకి వస్తాయని భూములకు మరింత డిమాండ్ పెరుగుతుందని వివరించారు. సర్కారు 60 శాతానికి మించి ఇచ్చే పరిస్థితి లేకపోవడంతో రైతులు ముందుకు రావడం లేదు.