సిటీబ్యూరో, ఆగస్టు 25 (నమస్తే తెలంగాణ) : పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్రతి ఏటా మాదిరిగానే ఈ ఏడాది లక్ష మట్టి విగ్రహాలను హెచ్ఎండీఏ పంపిణీ చేస్తున్నది. మట్టి గణపతులనే పూజిద్దామంటూ ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చేందుకుగానూ తమ వంతు బాధ్యతగా ఉచితంగా ఎనిమిది అంగుళాల పొడవుతో కూడిన మట్టి విగ్రహాలను అందించాలని పురపాలక ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, హెచ్ఎండీఏ కమిషనర్ అరవింద్ కుమార్ నిర్ణయించారు. ఈ మేరకు 41 కేంద్రాలను ఎంపిక చేసిన అధికారులు గురువారం ఉచితంగా విగ్రహాలను పంపిణీ చేశారు. ఆయా ప్రాంతాలలో ఈ నెల 30 వరకు మట్టి గణపతులను పంపిణీ చేయనున్నట్లు అధికారులు పేర్కొన్నారు.