సిటీబ్యూరో, మే 15(నమస్తే తెలంగాణ): డీఎన్ఏ పరిశోధనల్లో కీలకపాత్ర పోషిస్తున్న సెంటర్ ఫర్ డీఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ అండ్ డయాగ్నోస్టిక్స్ సంస్థ ఇప్పుడు ఆవిష్కరణలకు వేదికగా మారుతున్నది. ఎన్నో అంతు చిక్కని, తరతరాలుగా పట్టి పీడిస్తున్న వ్యాధులకు పరిష్కారం కనుగొనే కేంద్రంగా నిలుస్తోంది. వినూత్న ఆవిష్కరణలతో యువ పారిశ్రామికవేత్తలను ప్రోత్సహిస్తున్నది. ఇప్పటికే అంతర్జాతీయ స్థాయి వైద్య విధానాలతో హెల్త్ హబ్‌గా నిలిచిన హైదరాబాద్..కరోనా తర్వాత వినూత్న ఆవిష్కరణలతో హెల్త్‌కేర్ స్టార్టప్‌లకు ప్రధాన కేంద్రంగా రూపాంతరం చెందుతున్నది.
ఈ క్రమంలో అంతు చిక్కని ఎన్నో వ్యాధులకు పరిష్కారాలను అందించేలా సీడీఎఫ్‌డీ ఇంక్యుబేటర్ ప్రత్యేక పాత్రను పోషిస్తున్నది. స్టార్టప్ ఏకో సిస్టంతో, వినూత్నమైన ఆలోచనలకు కార్యరూపాన్ని తీసుకురావడంలో సీడీఎఫ్‌డీ- ఇంక్యుబేటర్ స్టేట్ ఆఫ్ ద ఆర్ట్ సౌకర్యాలను అందిస్తున్నది. ఔత్సాహికవేత్తలకు అవసరమైన మార్గదర్శకాలతోపాటు ఫండింగ్, నెట్వర్కింగ్ సదుపాయాలను కల్పిస్తూ ప్రోత్సహిస్తున్నది. ఇటీవల కాలంలో హెల్త్ కేర్ రంగంలో స్టార్టప్‌లను నెలకొల్పే యువ పారిశ్రామికవేత్తలను ఆకర్షించేలా ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తోంది. ఆలోచనలకు ఆచరణాత్మక రూపాన్ని అందించే సంస్థలను ప్రోత్సహిస్తూ హెల్త్ కేర్ స్టార్టప్‌లకు సీడీఎఫ్‌డీ ఇంక్యుబేటర్ ఎదుగుతున్నది.
లైఫ్ సైన్సెస్ రంగంలో ఆవిష్కరణలకు అత్యంత డిమాండ్ ఏర్పడింది. ముఖ్యంగా పెరుగుతున్న వైద్య, ఆరోగ్య అవసరాల దృష్ట్యా, విస్తరిస్తున్న వ్యాధుల నియంత్రణలో హెల్త్ స్టార్టప్‌లకు క్రమంగా ప్రాధాన్యత పెరుగుతున్నది. అందుకే సమాజంలో ఎదురవుతున్న ఎన్నో వైద్య సంబంధిత సమస్యలకు పరిష్కారాలను అందించే ఆవిష్కరణలను ప్రోత్సహిస్తున్నట్లుగా సీడీఎఫ్‌డీ డైరెక్టర్ ప్రొ.
ఉల్లాస్ కొల్తూర్ అన్నారు. భావి ఇన్నోవేటర్లకు అవసరమైన అన్ని మౌలిక సదుపాయాలను కల్పిస్తున్నట్లుగా తెలిపారు. స్వయం ప్రతిపత్తి కలిగిన ఈ సంస్థ ఇంక్యుబేటర్‌లో ఇప్పటికే స్టార్టప్‌లు అందుబాటులోకి వస్తూనే ఉన్నాయి. పరిశ్రమ అవసరాలకు అనుగుణంగా మానవ వనరులు, నిపుణులతో స్టార్టప్ ఏకో సిస్టంను విస్తరిస్తున్నారు. సీడీఎఫ్‌డీ అందిస్తున్న ప్రోత్సాహంతో ఏఐ ఆధారిత టర్న్ఇట్, యూటోపియా థెరాపాటిక్స్ వంటి స్టార్టప్‌లు కార్యకలాపాలను మొదలుపెట్టాయి.