Banjarahills | బంజారాహిల్స్, జూన్ 20 : బంజారాహిల్స్ రోడ్ నెం 12లోని ఎన్బీటీ నగర్ ప్రభుత్వ పాఠశాలలో రూ.1.16 కోట్ల వ్యయంతో నిర్మించిన అదనపు గదులు ప్రారంభానికి సిద్దమయ్యాయి. రెండేళ్ల క్రితం మన ఊరు మనబడి పథకం కింద ప్రారంభించిన ఈ భవన నిర్మాణానికి జీహెచ్ఎంసీ మేయర్ చొరవతో అప్పటి రాజ్యసభ ఎంపీ కే.కేశవరావు రూ.20 లక్షల ఎంపీ ల్యాడ్స్ నిధులు అందించారు. కాగా మన ఊరు మనబడి పథకం కింద రూ.48.45 లక్షలు, సర్వశిక్షా అభియాన్ కింద రూ.26 లక్షలు, అమ్మ ఆదర్శ పాఠశాల స్కీమ్ కింద రూ.22.40 లక్షలు మంజూరు కాగా ఈ మొత్తం నిధులతో స్కూల్ భవనాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. ప్రభుత్వ పాఠశాలలో ప్రస్తుతం ఉన్న తరగతులకు అదనంగా 2 గదులతో పాటు విద్యార్థుల కోసం డైనింగ్ హాల్ తదితర వసతులను కొత్త భవనంలో కల్పించామని మేయర్ గద్వాల్ విజయలక్ష్మి తెలిపారు. శనివారం పాఠశాల భవనాన్ని స్థానిక ఎమ్మెల్యే దానం నాగేందర్‌తో కలిసి ప్రారంభించనున్నామని మేయర్ పేర్కొన్నారు.