హైదరాబాద్, ఆగస్టు 13 (నమస్తే తెలంగాణ) : దేశం స్వయం సమృద్ధి సాధించేందుకు పబ్లిక్, ప్రైవేట్, ఇతర రంగాలన్నీ పరస్పర సహకార కార్యక్రమాలను చేపట్టాలని గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ అభిప్రాయపడ్డారు. శుక్రవారం రాజ్‌భవన్ నుంచి ‘ఇండియా@75 వీక్, పుదుచ్చేరి-2022పై ప్రత్యేక దృష్టి” అనే అంశంపై ఆమె మట్లాడారు. కాలుష్య రహిత పట్టణాలు అభివృద్ధి, చిన్న, సూక్ష్మ తరహా పరిశ్రమలకు మద్ధతు తదితర విషయాల్లో సుస్థిరమైన విధానాలను అవలంభించడం ద్వారా స్వయం సమృద్ధిని సాధించవచ్చన్నారు. కొవిడ్ విపత్కర పరిస్థితులను ఒక అవకాశంగా వినియోగించుకొని కొత్త ఆవిష్కరణలు, పరిశోధనలు చేయాలన్నారు. సీఐఐ పుదుచ్చేరి చైర్మన్ విజయ్ గణేశ్, సీఐఐ కౌన్సిల్ ఆన్ ఇండియా 75 చైర్మన్ రాజన్ నవని పాల్గొన్నారు.
సమాజంలో మరింత మంది మహిళా నెఫ్రాలజిస్టులు రావాల్సిన అవసరం ఉందని గవర్నర్ అన్నారు. రాజ్‌భవన్ నుంచి శుక్రవారం వర్చువల్‌గా నిర్వహించిన కార్యక్రమంలో గవర్నర్ ఉమెన్ ఇన్ నెఫ్రాలజీ- ఇండియా(ఐ-విన్) అనే మహిళా నెఫ్రాలజిస్టుల ఆర్గనైజేషన్‌ను ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ కిడ్నీ సంబంధిత వ్యాధులపై అవగాహన కల్పించేందుకు మహిళా నెఫ్రాలజిస్టులు ముందుకు రావాల్సిన అవసరం ఉందన్నారు. ఐఎస్వోటీ అధ్యక్షుడు జై ప్రకాశ్ ఓఝా, ఐఎస్ఎన్ అధ్యక్షుడు డాక్టర్ కేఎల్ గుప్తా, ఇంటర్నేషనల్ సొసైటీ ఆఫ్ నెఫ్రాలజీ మాజీ అధ్యక్షుడు డాక్టర్ వివేక్నాథ్ఝా, తదితరులు పాల్గొన్నారు.