ఎల్బీనగర్, జనవరి 28 : భర్త, అత్తామామలు, వారి కుటుంబ సభ్యుల వేధింపులు భరించలేనంటూ ఓ ప్రభుత్వ డాక్టర్ సెల్ఫీ వీడియో తీసుకుని ఆత్మహత్యాయత్నం చేసింది. ఈ సంఘటన సరూర్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్నది. పోలీసులు, బాధితురాలి కథనం ప్రకారం.. కోహెడ గ్రామానికి చెందిన కర్రి వెంకట్‌రెడ్డి కుటుంబం ప్రస్తుతం చంపాపేట ప్రెస్ కాలనీలో నివసిస్తోంది. వెంకట్‌రెడ్డి కుమారుడు సికిందర్రెడ్డికి నాంపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో డాక్టర్‌గా పనిచేస్తున్న ప్రణీతతో 2018లో వివాహం జరిగింది. వీరికి ఒక కూతురు ఉంది. మొదట్లో అమెరికాలో ఉండి.. ఆ తర్వాత నగరానికి వచ్చారు. కొంతకాలం తర్వాత భర్తతో పాటుగా అత్తామామల వేధింపులు ప్రణీతకు ఎక్కువ కావడంతో పెద్దల సమక్షంలోనూ పంచాయితీలు జరిగాయి.
అయినా అత్తింటి కుటుంబం తనను నిత్యం వేధింపులకు గురి చేస్తున్నదని, వీరికితోడు వారి ఆడపడుచులు, బంధువులు కూడా ఇబ్బందులు పెడుతున్నారని ఆరోపిస్తూ డాక్టర్ ప్రణీత సెల్ఫీ వీడియో తీసుకుని ఆత్మహత్య చేసుకునేందుకు మాత్రలు మింగింది. పోలీసులకు మొరపెట్టుకున్నా తనకు న్యాయం జరగడం లేదని, తన అత్తింటివారి నుం చి తనకు న్యాయం జరగదని కన్నీటి పర్యంతం అవుతున్నది. ప్రస్తుతం స్థానిక కర్మన్‌ఘాట్ జీవన్ ఆసుపత్రిలో ప్రణీత చికిత్స పొందుతోంది. కాగా.. పోలీసులకు ఫిర్యాదులు చేసినా స్పం దించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించడంతోనే ప్రణీత ఆత్మహత్యాయత్నం చేసిందని ఆరోపిస్తూ బాధితురాలి కుటుంబ సభ్యు లు, బంధువులు సరూర్‌నగర్ పోలీస్‌స్టేషన్ ఎదుట ఆందోళన చేపట్టారు.