సిటీబ్యూరో: గూగుల్ ఇండియా ప్రతినిధుల బృందం తెలంగాణ రాష్ట్ర పోలీస్ ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోలింగ్ సెంటర్‌ను శుక్రవారం సందర్శించింది. ప్రస్తుతం హైదరాబాద్‌లో ట్రాఫిక్ నిర్వహణ వ్యవస్థను అధ్యయనం చేయడంతో పాటు గూగుల్ యొక్క అత్యాధునిక సాంకేతిక పరిష్కారాలను వినియోగించి మరింత మెరుగుపరచడానికి కావాల్సిన సూచనలను గూగుల్ ప్రతినిధులు నగర పోలీసులకు అందించారు.
గూగుల్ ప్రతినిధులకు హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ టీజీఐసీసీసీ కార్యకలాపాలపై పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఇందులో రియల్ టైమ్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ ఎలా నిర్వహించబడుతుందో, అధునాతన నిఘా వ్యవస్థలు, డేటా అనలిటిక్స్, గూగుల్ మ్యాప్స్ డేటాను అనుసంధానం చేయడం ద్వారా రద్దీ ప్రాంతాలను గుర్తించడం వంటి అంశాలను వివరించారు.
ప్రధానంగా గూగుల్ మ్యాప్స్ లైవ్ ట్రాఫిక్ డేటాను టీజీఐసీసీసీకి అనుసంధానం చేయడం, వాహనాల స్థితిని ఆధారంగా చేసుకొని ఆటోమేటెడ్ ట్రాఫిక్ సిగ్నల్ వ్యవస్థను అభివృద్ధి చేయడం, రియల్ టైమ్‌లో గస్తీ వాహనాల ట్రాకింగ్, ట్రాఫిక్ పర్యవేక్షణ కోసం డ్రోన్ నిఘా అమలు వంటి అంశాలపై చర్చించారు. ఇటీవల గూగుల్, ప్రభుత్వం మధ్య కుదిరిన ఒప్పందం నేపథ్యంలో గూగుల్ టీమ్ టీజీఐసీసీసీని సందర్శించినట్లు ప్రతినిధులు తెలిపారు. ట్రాఫిక్ అడిషనల్ సీపీ విశ్వప్రసాద్, అడ్మిన్ జాయింట్ సీపీ జె పరిమళ హాన నూతన్, ఐసీసీసీ ఎస్పీ పుష్ప, గూగుల్ డీప్ మైండ్ వైస్ ప్రెసిడెంట్ చందు తోట తదితరులు పాల్గొన్నారు.