గ్రేటర్లో అగ్ని ప్రమాదాల నివారణకు జీహెచ్ఎంసీ ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికను అమలు చేస్తున్నది. వాణిజ్య సముదాయాలపై ఇప్పటి వరకు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించిన అధికారులు తాజాగా చిన్న చిన్న వ్యాపారస్తులపై దృష్టి సారించారు.
120 గజాలపైన ఉన్న వ్యాపార భవనాలపై ఫోకస్
అగ్నిప్రమాదాల నివారణకు జీహెచ్ఎంసీ ప్రణాళిక
సిటీబ్యూరో, మార్చి 27 (నమస్తే తెలంగాణ) : గ్రేటర్లో అగ్ని ప్రమాదాల నివారణకు జీహెచ్ఎంసీ ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికను అమలు చేస్తున్నది. వాణిజ్య సముదాయాలపై ఇప్పటి వరకు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించిన అధికారులు తాజాగా చిన్న చిన్న వ్యాపారస్తులపై దృష్టి సారించారు. 100 స్కేర్ మీటర్ల (సుమారు 120 గజాలు) విస్తీర్ణంలో భవనాలు ఫైర్ మిటిగేషన్, ఫైర్ సేఫ్టీ సర్టిఫికెట్ జారీ ప్రక్రియను సోమవారం ప్రారంభించారు. చిన్న, చిన్న షాపులు, వ్యాపారం చేసుకునే ఇంటి యాజమానులు, అద్దెకు తీసుకుని 100 స్కేర్ మీటర్ల కంటే తక్కువ కానీ అంతకంటే ఎక్కువ ప్లింత్ ఏరియాలో వ్యాపారం చేసుకునే వారంతా అగ్ని ప్రమాదాల నివారణకు ఎవరికీ వారే స్వయంగా ఫైర్ మిటిగేషన్/సేఫ్టీ సర్టిఫికెట్ తీసుకునేందుకు ఆన్లైన్లో పొందవచ్చని అధికారులు తెలిపారు. ప్రతి వ్యాపారస్తుడు ఈ సర్టిఫికెట్‌ను తీసుకోవాలని అధికారులు సూచించారు.
ఆన్లైన్లో పొందే విధానం :
ముందుగా www.ghmc.gov.in వెబ్‌సైట్‌ను క్లిక్ చేసి ఫైర్ మిటిగేషన్/సేఫ్టీ సర్టిఫికెట్‌ను సెలెక్ట్ చేయాలి. ఈ లింకు firesafety.ghmc.gov.in/ Login/Citizen_login కావాలి.
వెబ్సైట్/లింక్ లాగిన్ అయిన తర్వాత తమ మొబైల్ నెంబరు ఎంటర్ చేసిన వెంటనే వచ్చిన ఓటీపీని తప్పనిసరిగా నమోదు చేయాలి.
అగ్ని అర్పే పరికరాల ఏజెన్సీ జాబితా నుంచి తమకు నచ్చిన ఎంపానెల్ ఏజెన్సీ సెలెక్ట్ చేసుకోవాలి
అర్జీదారుడు ఇంటి ట్యాక్స్ ఇండెక్స్ నంబరు (టిన్) కలిగి ఉన్న పక్షంలో టిన్ నంబర్‌తో పాటుగా ఎంపానెల్ ఏజెన్సీని ఎంపికను కన్ఫర్మ్ చేసుకోవాలి.
ఒకవేళ టిన్ నంబర్ లేని పక్షంలో షాప్ ఎస్టాబ్లిష్మెంట్, అడ్రస్, సర్కిల్, జోన్‌ను ఎంపిక చేసుకున్న తర్వాత ఎంపానల్ ఏజెన్సీని సెలెక్ట్ చేసుకొని కన్ఫర్మ్ చేసుకోవాలి.
ఎంపానెల్డ్ ఏజెన్సీని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఏజెన్సీ తమ షాపు వద్దకు వచ్చి అగ్ని ఆర్పే పరికరాన్ని ఫిట్టింగ్ చేసిన తర్వాత ఆ ఏజెన్సీ ఫిట్టింగ్ చేసినట్టు వెబ్సైట్లో నమోదు చేస్తారు. తదుపరి ఫైర్ మిటిగేషన్/సేఫ్టీ సర్టిఫికెట్ ఆన్లైన్లో జనరేట్ అవుతుంది. ఆ తర్వాత తమ అప్లికేషన్ స్టేటస్ రిపోర్టులో చూసుకోవచ్చు.
జనరేట్ అయిన సేఫ్టీ సర్టిఫికెట్‌ను డౌన్లోడ్ చేసుకుని షాప్‌లో డిస్ప్లే చేసుకోవాలి.