GHMC | సిటీబ్యూరో, జనవరి 27 (నమస్తే తెలంగాణ): జీహెచ్ఎంసీ ఎస్టేట్ విభాగం కళ్లు మూసుకున్నది. సంస్థకు ఎక్కడెక్కడ ఆస్తులు ఉన్నాయి? ఎన్ని షాపుల అద్దె గడువు ముగిసింది? ఏళ్ల తరబడి లీజు గడువు ముగిసిన ఆయా దుకాణాలు ఎందుకు ఖాళీ చేయలేదు? జారీ చేసిన నోటీసులు ఎన్ని? మళ్లీ టెండర్ల వేలం వేసి ఆదాయాన్ని ఎందుకు పెంచుకోవడం లేదు? అనే ప్రశ్నలకు వారి వద్ద నుంచి సమాధానమే లేదు. అసలు ఆ దిశగా సమీక్షే లేదు. ఇది చాలదన్నట్లు ఘనత వహించిన ఎస్టేట్ విభాగంలో కొందరి అధికారులు కేవలం తమకు వచ్చే వసూళ్లపైనే దృష్టి పెడుతున్నట్టు జీహెచ్ఎంసీ శాఖలోనే చర్చ జరుగుతున్నది. నోటీసులు ఇవ్వడం ఆ తర్వాత అందినంత దండుకోవడం ఓ తంతుగా మారింది. చివరకు మేయర్ స్వయంగా తనిఖీలు చేసి ఆక్రమాలను వెలుగులోకి తీసుకువచ్చినప్పటికీ ఎస్టేట్ విభాగం అధికారుల్లో కనీస చలనం లేకుండా పోయింది.
ఇలా సీజ్ చేస్తే.. అలా తెరిపించేశారు
ఖైరతాబాద్ జోన్‌లోని గోషామహల్ సర్కిల్ -14లో అజాద్(మోతి)మార్కెట్లో రెండు నెలల క్రితం మేయర్ గద్వాల్ విజయలక్ష్మి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ తనిఖీలో కళ్లు చెదిరే వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. అడుగడుగునా కలుషిత, అపరిశుభ్రమైన, నాణ్యత లేని మాంసం విక్రయాలు జరుపుతున్నట్లు తేలింది. వెంటనే సంబంధిత రెండు చికెన్ షాపులను తక్షణమే సీజ్ చేయాలని మేయర్ అధికారులను ఆదేశించింది. ఇది జరిగిన కొద్ది సేపటికే మజ్లిస్ పార్టీ ఎమ్మెల్సీ బేగ్, కొందరు వార్డు మెంబర్లు ఆ మార్కెట్‌కు చేరుకుని జీహెచ్ఎంసీ అధికారులను బెదిరించారు. సీజ్ చేసి తీసుకువెళ్లిన చికెన్‌ను బలవంతంగా వెనక్కి తీసుకున్నారు. తిరిగి 24 గంటల వ్యవధిలోనే షాపులను తెరిపించి యథేచ్ఛగా వ్యాపారం సాగేలా చేశారు. ఈ విషయంలో మేయర్ ఆదేశాలను అధికారులే ఖాతరు చేసే పరిస్థితీ తీసుకొచ్చారు.
ఇంట్లో ఎలుకలు ఉన్నాయని, ఇంటిని సీజ్ చేసుకుంటామా? అంటే ఎమ్మెల్సీ బేగ్ మేయర్ తనిఖీల తీరును ఎండగట్టారు. మరోవైపు మేయర్ మాత్రం.. ఎట్టి పరిస్థితుల్లోనూ చర్యలు ఉండాల్సిందేనని అధికారులకు హుకుం జారీ చేశారు. ఇది జరిగి రెండు నెలలు కావొస్తున్నా నేటికీ ఆజాద్ మార్కెట్ లో బల్దియా నిబంధనలు అమలు కావడం లేదు. విచిత్రమేమిటంటే ఆ మార్కెట్లో 1960 సంవత్సరంలో లీజు తీసుకుని గడువు ముగిసి సంవత్సరాలు గడిచినా కొన్ని షాపులు కొనసాగిస్తుండడం అధికారుల పనితీరుకు అద్దం పడుతున్నది. మొత్తం 11 షాపులలో మూడు షాపుల నుంచే క్రమం తప్పకుండా అద్దెలు వస్తుండగా, మిగిలిన 8 షాపుల నుంచి సంవత్సరాల తరబడి అద్దెలు రావడం లేదు. పైగా ప్రజా ఆరోగ్యానికి తీవ్రమైన ముప్పును కలిగిస్తూ వ్యాపారాలు జరుగుతున్నాయి. కానీ నేటికీ అటు వైపు వైద్య విభాగం, జోనల్ కమిషనర్లు, ఎస్టేట్ విభాగం కన్నెత్తి చూపకపోవడం పట్ల తీవ్ర స్థాయిలో విమర్శలు వినిపిస్తున్నాయి.
అసలు ఆ రోజు ఏం జరిగిందంటే ?
సర్కిల్-14 డిప్యూటీ కమిషనర్, అసిస్టెంట్ మెడికల్ ఆఫీసర్ హెల్త్, వెటర్నరీ డిప్యూటీ డైరెక్టర్ అసిస్టెంట్ డైరెక్టర్, వెటర్నరీ ఆఫీసర్ అధికారుల బృందం రషీద్ హుస్సేన్ (స్టాల్ నం.3), కలీమ్ హుస్సేన్‌లు (స్టాల్ నం 42) నిర్వహిస్తున్న చికెన్ షాపులపై నవంబరు రెండవ వారంలో తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీలో 1600 కంటే ఎక్కువ బ్రాయిలర్ కోళ్లు, 30 కిలోల డ్రెస్డ్ చికెన్, 7 కిలోల లివర్ కనుగొన్నారు. ప్రజా ఆరోగ్య భద్రత దృష్ట్యా వెటర్నరీ విభాగం సంబంధిత చికెన్, లివర్‌ను స్వాధీనం చేసుకుని బ్రాయిలర్ పక్షులు(కోళ్లు) రెండు గంటల లోపు తీసుకువెళ్లాలని ఆయా షాపుల నిర్వాహకులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ ఘటన జరిగిన కొంత సమయం తర్వాత మజ్లిస్ పార్టీ ఎమ్మెల్సీ బేగ్, కొందరు వార్డు మెంబర్లు అక్కడకు చేరుకుని జీహెచ్ఎంసీ అధికారులను బెదిరించారు. సీజ్ చేసి తీసుకువెళ్లిన చికెన్‌ను బలవంతంగా తీసుకువెళ్లారు.
ఈ ఘటనపై గోషామహల్ సర్కిల్ వెటర్నరీ ఆఫీసర్ కాచిగూడ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అంతేకాకుండా జీహెచ్ఎంసీ చట్టం 1955 సెక్షన్ 521, 622, 487, 596 కింద షాపులు ఖాళీ చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు షాపుల యాజమానులు ఆ నోటీసులు స్వీకరించకుండా తిరస్కరించడంతో వాటిని గోడపై అతికించడంతో పాటు రిజిస్టర్డ్ పోస్ట్ ద్వారా పంపించారు. కానీ నేటికీ షాపులను ఖాళీ చేయించలేకపోవడం గమనార్హం. సంబంధిత షాపుల నుంచి రూ.లక్షల్లో అద్దెలు రావడమే కాదు…ఆ దుకాణాల నుంచి సంబంధిత యాజమానులను ఖాళీ చేయించి కొత్తగా వేలం ద్వారా టెండర్లు పిలిచి ఆదాయాన్ని పెంచుకోవాల్సిన చోట ఇదేమి పట్టడం లేదు. అదనపు కమిషనర్ (హెల్త్)తో పాటు సంబంధిత ఎస్టేట్ విభాగం అధికారుల నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కనబడుతున్నది. ఆ షాపుల జోలికి వెళ్లకపోవడం వెనుక అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బహిరంగంగా లీజు గడువు ముగిసిందని తెలిసినా షాపుల జోలికి వెళ్లకపోవడం వెనుక ఎవరి ఒత్తిళ్లకు తలొగ్గుతున్నారు? అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. అంతేకాకుండా బాధ్యులైన అధికారులపై ఇప్పటి వరకు చర్యలు తీసుకోకపోవడం పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.