
సిటీబ్యూరో, నవంబర్ 5 (నమస్తే తెలంగాణ) : జీహెచ్ఎంసీ ఉద్యోగులకు ఇక నుంచి ప్రతి నెలా 1వ తేదీనే జీతాలు అందనున్నాయి. గడిచిన కొన్ని నెలలుగా సంస్థ ఆర్థిక సుడిగుండంలో చుట్టుకున్న నేపథ్యంలో నెలలో రెండో వారంలో వేతనాలు అందేవి. అయితే జీహెచ్ఎంసీకి ప్రధాన ఆదాయ వనరుగా ఆస్తి పన్ను వసూళ్లలో సంస్కరణలు చేపట్టి స్పెషల్ డ్రైవ్ ద్వారా వసూళ్ల వేగం పెంచారు. ఫలితంగా బల్దియా ఆదాయం పెరిగింది. దీంతో ప్రాధాన్యతక్రమంలో భాగంగా ఉద్యోగులకు ప్రతి నెలా ఒకటో తేదీన వేతనాలు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ నెల 1వ తేదీన చెల్లించారు. ఇదే ఒరవడిని కొనసాగించనున్నారు. కాగా, ఉద్యోగుల వేతనాలకు సంబంధించి ముందస్తుగా బిల్లులు సమర్పించని అధికారుల నిర్లక్ష్యంపై కమిషనర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. చార్మినార్ జోన్కు సంబంధించిన ముగ్గురు అధికారులపై సస్పెన్షన్ వేటువేయడం గమనార్హం.