
సిటీబ్యూరో, నవంబరు 1(నమస్తే తెలంగాణ): జీహెచ్ఎంసీలో స్థాయి సంఘం సభ్యుల ఎన్నికకు ఎట్టకేలకు ముహూర్తం కుదిరింది. పాలక మండలి ఏర్పాటైన తొమ్మిది నెలల అనంతరం, జీహెచ్ఎంసీ ఎన్నికల విభాగం అధికారులు సోమవారం షెడ్యూల్ తేదీలను ప్రకటించారు. ఏడాది కాల పరిమితితో మొత్తం 15 సభ్యులను ఎన్నుకోనున్నారు. ఈ మేరకు నవంబరు 2న (మంగళవారం) నోటిఫికేషన్ జారీ చేస్తుండగా, నవంబరు 3 నుంచి 11వ తేదీ వరకు రోజూ ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్ల స్వీకరణ (సెలవు రోజులైన 4, 7వ తేదీలు మినహా) జరగనుంది. ఔత్సాహికులు ఎన్నికల విభాగం అదనపు కమిషనర్ కార్యాలయంలో నామినేషన్ పత్రాలు సమర్పించాలని అధికారులు తెలిపారు. 11న మధ్యాహ్నం 3 గంటల తర్వాత అభ్యర్థులు సమర్పించిన నామినేషన్ పత్రాలను మరుసటి రోజున పరిశీలించి అర్హుల పేర్లను ప్రకటిస్తారని పేర్కొన్నారు. 15వ తేదీ మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్ ఉప సంహరణకు గడువు ఉంటుందని, పోటీలో 15 మంది కన్నా ఎక్కువ మంది నిలిస్తే 20వ తేదీన జీహెచ్ఎంసీ కమిషనర్ కార్యాలయంలో ఎన్నిక పక్రియను నిర్వహించి ఫలితాలను వెల్లడిస్తామని చెప్పారు. పోటీ లేకుంటే ఎన్నిక ఏకగ్రీవం అవుతుందని పేర్కొన్నారు. కార్పొరేటర్లు మాత్రమే పోటీలో నిలిచేందుకు అర్హులని చెప్పారు.