
బంజారాహిల్స్, అక్టోబర్ 31: సుప్రీంకోర్టు ఉత్తర్వులు ఉల్లంఘిస్తూ నిర్మాణాలు కొనసాగిస్తున్న నిర్మాణదారులపై చర్యలు తీసుకోవాలంటూ జీహెచ్ఎంసీ టౌన్‌ప్లానింగ్ అధికారులు ఇచ్చిన ఫిర్యాదుతో బంజారాహిల్స్ పోలీసులు ముగ్గురిపై క్రిమినల్ కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బంజారాహిల్స్ రోడ్ నం .12లో షేక్‌పేట మండలం సర్వే నం. 129/52(327) పరిధిలోకి వచ్చే స్థలంపై సుప్రీంకోర్టులో కేసు నడుస్తున్నది. ఈ స్థలం 129/68(పైకి) అనే సర్వే నంబర్ కిందకు వస్తుందంటూ..కొందరు నిర్మాణాలు చేస్తుండటంతో సుకుమార్‌రెడ్డి అనే వ్యక్తి సుప్రీంకోర్టును ఆశ్రయించగా, యథాతదా స్థితి కొనసాగించాలంటూ ఇటీవల న్యాయస్థానం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. అయినప్పటికీ కోర్టు ఉత్తర్వులు పట్టించుకోకుండా ప్రీతమ్ లాల్వానీ, వినోద్ లాల్వానీ అనే వ్యక్తులు ప్లాట్ నం. 55లో, ముకుంద్‌లాల్ బహేతీ అనే వ్యక్తి ప్లాట్ నంబర్ 81లో నిర్మాణాలు కొనసాగిస్తున్నారని, ఎన్నిసార్లు అడ్డుకున్నా పనులు ఆపడం లేదంటూ.. జీహెచ్ఎంసీ సర్కిల్-18 టౌన్‌ప్లానింగ్ డిప్యూటీ సిటీ ప్లానర్ రాజు బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కోర్టు ఉత్తర్వులు ఉల్లంఘిస్తున్న ప్రీతమ్ లాల్వానీ, వినోద్ లాల్వానీ, ముకుంద్‌లాల్ బహేతీలపై బంజారాహిల్స్ పోలీసులు ఐపీసీ 188 సెక్షన్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.