
సిటీబ్యూరో, అక్టోబరు 29 (నమస్తే తెలంగాణ): కాలుష్యకారక పటాకుల విక్రయాలపై నిషేధం విధిస్తూ జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేశ్‌కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. పటాకులతో గాలి కలుషితమవుతోందని, నియంత్రణ చర్యల్లో భాగంగా సుప్రీంకోర్టు, జాతీయ హరిత ట్రిబ్యునల్ గతంలో ఇచ్చిన మార్గదర్శకాలను అనుసరించి నగరంలో నిషేధం అమలు చేస్తున్నామని అన్నారు. విదేశీ, స్వదేశంలో తయారైన ఎక్కువ శబ్ధం వెదజల్లే పటాకులను వినియోగించవద్దన్నారు. నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు ఉంటాయన్నారు. పర్యావరణ హితమైన పటాకులనే నగర వాసులు వాడాలన్నారు. గ్రీన్ పటాకుల విక్రయాలను ప్రోత్సహించే చర్యల్లో భాగంగా జోన్లు, సర్కిళ్ల వారీగా పటాకుల విక్రయ కేంద్రాలకు అనుమతులు జారీ చేస్తున్నామని వెల్లడించారు. చిల్లర విక్రయ కేంద్రాలకు రూ.8వేలు, హోల్‌సేల్‌గా విక్రయించే దుకాణాలకు రూ.50 వేల చొప్పున రుసుం చెల్లించాలన్నారు.