
రోడ్డు కటింగ్ అనుమతుల జారీలో అడ్డంకులు తొలగిపోనున్నాయి. వర్షాకాలం నేపథ్యంలో జూన్ 1 నుంచి అక్టోబ ర్ 31 వరకు కొత్తగా రోడ్డు తవ్వకాలను నిలిపివేశారు. అయితే, ప్రజల సౌకర్యార్థం వచ్చేనెల 1 నుంచి రోడ్డు తవ్వకాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ జోనల్ కమిషనర్లకు ఆదేశాలు జారీ అయ్యాయి. ఇప్పటి వరకు అత్యవసర పనుల నిమిత్తం మాత్రమే అనుమతులు ఇస్తున్నారు. నాలుగు మాసాలుగా నిలిచిపోయిన సెల్లార్ తవ్వకాలతోపాటు నల్లా, సీవరేజీ, విద్యుత్ కనెక్షన్లు పొందే ప్రక్రియ మరింత సులభతరం కానుంది. వీటితోపాటు ప్రైవేట్ సంస్థలు కేబుల్స్ తవ్వకాలకు అనుమతులు లభించనున్నాయి.
వర్షాకాలం నేపథ్యంలో అత్యవసర పనులకు మాత్ర మే జీహెచ్ఎంసీ ఇంజినీరింగ్ విభాగం రోడ్ కటింగ్ పనులకు అనుమతులు మంజూరు చేసింది. ఈ సీజన్ ప్రారం భ సమయం నుంచి అక్టోబర్ 31 వరకు కొత్తగా రోడ్డు తవ్వకాలను నిలిపివేస్తూ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. దీంతో నాలుగు మాసాలుగా పలు ప్రభుత్వం, ప్రైవేటు సంస్థలు చేపట్టిన అత్యవసర రోడ్డు కటింగ్ పనులకు మాత్రమే జీహెచ్ఎంసీ అనుమతులు ఇచ్చింది.
ఈ వర్షాకాలం సీజన్లో విస్తారంగా వానలు పడ్డాయి. కుండపోత వానతో రహదారులు భారీగా దెబ్బతిన్నాయి. ఈ ఏడాది జూన్ నుంచి అక్టోబర్15వ తేదీ వరకు ఆయా సర్కిల్ పరిధిలో 13,940 చోట్ల ఏర్పడిన గుంతలకు యుద్ధ ప్రాతిపదికన మరమ్మతులు చేపట్టి ప్రజా
రవాణాకు ఇబ్బంది లేకుండా చేసినట్లు అధికారులు పేర్కొన్నారు.