
సిటీబ్యూరో, అక్టోబర్ 7 (నమస్తే తెలంగాణ) : గ్రేటర్లో నాలాల పూడికతీత పనులను మరింత పారదర్శకంగా చేపట్టేందుకు జీహెచ్ఎంసీ కీలక నిర్ణయం తీసుకుంది. ఏడాదికోకసారి కాకుండా ఇక మీదట వరుసగా మూడేండ్ల పాటు నాలాల నిర్వహణను ప్రైవేట్ ఏజెన్సీలకు అప్పగించనున్నారు. సమగ్ర రోడ్ల నిర్వహణ కార్యక్రమం (సీఆర్ఎంపీ) కింద నగర వ్యాప్తంగా 790 కిలోమీటర్ల మేర ప్రధాన రోడ్డు మార్గాలను జీహెచ్ఎంసీ రెండు సంవత్సరాల కిందట ప్రైవేట్ నిర్వహణకు ఇచ్చింది. జోన్ల వారీగా విభజించి, ఐదేండ్ల పాటు వాటిని నిర్వహించేందుకుగాను రూ.1850కోట్ల అంచనా వ్యయంతో ఈ కాంట్రాక్టును ఇచ్చారు. ప్రస్తుతం రెండవ సంవత్సరం పనులు జరుగుతున్నాయి. గతంలో కంటే ఈ మార్గాల్లో రహదారుల నిర్వహణ గణనీయంగా మెరుగుపడింది. దీంతో సీఆర్ఎంపీ తరహాలోనే నాలాల నిర్వహణను టెండర్ల ప్రక్రియ ద్వారా వరుసగా మూడేండ్ల పాటు ఏజెన్సీలకు అప్పగించేలా కసరత్తు ప్రారంభించారు. ఇటీవల ఉన్నతాధికారుల సమావేశంలో ఇందుకు సంబంధించి విధి విధానాల రూపకల్పనపై విస్తృతంగా చర్చించారు.
కూకట్పల్లి, శేరిలింగంపల్లి, ఎల్బీనగర్ జోన్లలో ఎక్కువగా నాలాలు ఉన్నాయి. ఖైరతాబాద్, సికింద్రాబాద్, చార్మినార్ జోన్లలో నాలాల పొడవు తక్కువ. అయితే జోన్ల వారీగా నాలాలను ప్యాకేజీలుగా విభజించి వాటికి టెండర్లు పిలిచేందుకు కసరత్తు చేస్తున్నారు. వచ్చే ఏడాది నుంచి ఏజెన్సీలకు అప్పగించేలా టెండర్ నిబంధనలపై దృష్టి సారించారు. టెండర్లు దక్కించుకున్న సమయం నుంచి మూడేండ్ల పాటు ఆయా నాలాల్లో ఆయా ఏజెన్సీ నిత్యం పూడికతీత జరపాల్సి ఉంటుంది. కనీసం ఒక్కో యంత్రం రోజుకు 8 గంటలు పనిచేయాలి. ఎన్ని యంత్రాలు, ఏ రకం యంత్రాలు ఉపయోగించాలనేది టెండర్ నిబంధనల ప్రకారం జరపాల్సి ఉంటుంది. పూడిక మట్టి రోడ్డుపై పడకుండా డంపింగ్ యార్టుకు తరలించడం, ప్రత్యేక రకం ట్రాలీలున్న టిప్పర్లను ఉపయోగించేలా టెండర్లలో నిబంధనలను పక్కాగా రూపొందిస్తున్నారు. ఇదే సమయంలో ఇరుకు గల్లీల్లో తిరుగుతూ వాటి మధ్యలో ప్రవహించే నాలాల పూడికతీతకు చిన్నపాటి జేసీబీలు, ట్రక్కులు అవసరం. అందుకుగాను ప్రత్యేక రకం ట్రాలీలున్న టిప్పర్లను ఉపయోగించేలా చర్యలు చేపడుతున్నారు. నాలాల పూడికతీత, నిర్వహణ మరింత మెరుగ్గా ఉండేలా అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు పేర్కొన్నారు.