
సిటీబ్యూరో, సెప్టెంబరు 29 (నమస్తే తెలంగాణ): పొరపాటుగా ఓటరు జాబితా నుంచి పేరు తొలగించిన వ్యక్తులకు తిరిగి ఓటరు నమోదుకు అవకాశం కల్పించాలని నిర్ణయించినట్లు జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేశ్‌కుమార్ తెలిపారు. బుధవారం రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు పోలింగ్ స్టేషన్ల పేర్ల మార్పు, ఓటర్ల తొలగింపు, అధికంగా ఓటర్లు కలిగిన పోలింగ్ స్టేషన్లు తదితర అంశాలపై అన్ని పార్టీల నేతలతో జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేష్‌కుమార్ సమావేశమయ్యారు. 1500ల కంటే ఎక్కువ ఓటర్లు 11 పోలింగ్ స్టేషన్లలో ఉన్నట్లు అఖిలపక్ష నాయకులు కమిషనర్ దృష్టికి తీసుకువచ్చారు. వీటితో పాటు 24 పోలింగ్ స్టేషన్ల సంఖ్య (పేరు) మార్పు, పోలింగ్ స్టేషన్ల హేతుబద్దీరణపై నివేదిక సమర్పణపై విస్తృతంగా చర్చించారు. ఈ కార్యక్రమంలో ఆయా పార్టీల నాయకులు మర్రి శశిధర్ రెడ్డి, జి.నిరంజన్, పి.రాజేశ్‌కుమార్, అభిషేక్ కెనడీ, మహ్మద్ మాజీద్ హుసేన్, ఆయూబ్‌ఖాన్, వాజీద్ హుసేన్, కొల్లూరు పవన్‌కుమార్, వీఎస్ భరత్ వాజ్, సయ్యద్ ముక్తాఖ్ అహ్మద్, దయానంద్, జీహెచ్ఎంసీ అడిషనల్ కమిషనర్ (ఎన్నికల విభాగం) పంకజ పాల్గొన్నారు.