
సిటీబ్యూరో, జూలై 5 (నమస్తే తెలంగాణ): మహానగరంలోని జంక్షన్లు కొత్త సొబగులు అద్దుకుంటున్నాయి. ఆధునీకరణలో భాగంగా ప్రభుత్వం ప్రత్యేక ఆకృతులు, వాటర్ ఫౌంటెన్లు, వర్టికల్ గార్డెన్లను ఏర్పాటు చేయడంతో పచ్చదనంతో కళకళలాడుతూ అతి సుందరంగా మారుతున్నాయి. అంతేకాక ఖైరతాబాద్ ఫ్లై ఓవర్, ఎన్టీఆర్ మార్గ్, మోజంజాహి మార్కెట్, బంజారాహిల్స్ ప్రధాన కూడళ్లతో పాటు పలు ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన లైటింగ్ నగరవాసులను మురిపిస్తున్నది.
జంటనగరాల్లో చారిత్రక నేపథ్యం కలిగిన క్లాక్ టవర్లను జీహెచ్ఎంసీ తీర్చిదిద్దింది. నిర్వహణకు నోచుకోక కళావిహీనంగా మారిన సికింద్రాబాద్, సెయింట్ జార్జ్, ఫతే మైదాన్‌లోని చరిత్రకు గుర్తులైన క్లాక్ టవర్లు ప్రస్తుతం సరికొత్త అందాలు అద్దుకొని నగరవాసులను మైమరపింపజేస్తున్నాయి.