ఘట్కేసర్, అక్టోబర్ 6ః పిల్లల గొడవ తల్లిదండ్రుల మధ్య తగాదాగా మారి ఓ వ్యక్తి ప్రాణం తీసిన సంఘటన ఘట్కేసర్ పోలీసు స్టేషన్ పరిధి అవుషాపూర్‌లో జరిగింది. మృతుడి కుటుంబ సభ్యులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం& ఘట్కేసర్ మున్సిపాలిటీ అవుషాపూర్‌లో సయ్యద్ అమీర్(34), సయ్యద్ అలీ కుటుంబాలు ఎదురెదురుగా నివాసం ఉంటున్నారు. ఆదివారం మధ్యాహ్నం తర్వాత అమీర్ ఇంటి ముందు అతని పిల్లలు హసీనా, అజ్మెద్, సయ్యద్ అలీ కుమారుడు అబూలు గొడవ పడుతున్నారు. అది గమనించిన అమీర్ అక్కడికి చేరుకుని పిల్లలకు సర్ధి చెప్పి స్నేహ పూర్వకంగా ఉండాలని సూచించి పంపించాడు.
అయితే అబూ ఇంటికి వెళ్లి విషయం తన తండ్రి అలీకి చెప్పటంతో అగ్రహంతో అక్కడికి చేరుకుని అమీర్‌తో గొడవ పడ్డాడు. ఇద్దరూ ఒకరినొకరు తోసుకుని కొట్టుకున్నారు. అది గమనించిన స్థానికులు గొడవను ఆపి వారిని ఇండ్లలోకి పంపించారు. సంఘటన జరిగిన అరగంట తర్వాత అమీర్‌కు ఛాతి నొప్పి, వాంతులు కావటంతోపాటు చెమటలు పట్టడంతో అతని కుటుంబ సభ్యులు ఘట్కేసర్ ప్రభుత్వ దవాఖానకు తరలించారు. పరీక్షించిన వైద్యులు అమీర్ అప్పటికే మృతి చెందినట్లు ధ్రువీకరించారు. తన భర్త మరణానికి సయ్యత్ అలీతో జరిగిన గొడవే కారణమని మృతుడి భార్య సోనీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ దవాఖానకు తరలించారు.
సయ్యద్ అమీర్ శవం పోస్టుమార్టం అనంతరం అవుషాపూర్‌లోని ఇంటికి చేరుకోగానే అతని కుటుంబ సభ్యులు, బంధువులు అలీని కఠినంగా శిక్షించాలని, నష్టపరిహారంగా రూ.20 లక్షలు ఇవ్వాలని గొడవకు దిగారు. జాతీయ రహదారిపైకి చేరుకుని రోడ్డుకు అడ్డంగా బైఠాయించి ధర్నాకు దిగారు. పోలీసులు ఎంత చెప్పినా వినిపించుకోకుండా నిందితుడు అలీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో ట్రాఫిక్ కిలో మీటర్ల మేర స్తంభించింది. ఘట్కేసర్ ఇన్స్పెక్టర్ ఎం.బాలస్వామి, అడిషనల్ ఇన్స్పెక్టర్ జే.శ్రీనివాస్, పోచారం ఐటీ కారిడార్ ఇన్స్పెక్టర్ రాజువర్మ, మేడిపల్లి ఇన్స్పెక్టర్ గోవింద్‌రెడ్డి, ఎస్సైలు, పోలీసు సిబ్బంది అందోళన చేస్తున్న వారిని చెదరగొట్టి ట్రాఫిక్‌ను పునరుద్ధరించారు.