సిటీబ్యూరో, (నమస్తే తెలంగాణ) : గ్రేటర్లో చెత్త సమస్య జఠిలంగా మారింది. రహదారులు, కాలనీలు, బస్తీలు ఎక్కడ చూసినా చెత్త కుప్పలు గుట్టలు గుట్టలుగా పేరుకుపోతున్నాయి. అటుగా వెళ్లాలంటే ముక్కు మూసుకోవాల్సిందేనని, దోమలు, ఈగలకు ఆవాసంగా మారుతున్నాయని జనం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అసలే వర్షాలు పడుతున్న వేళ.. కాలనీ, బస్తీలు కంపుకొడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే వ్యాధులు వ్యాప్తి చెందే అవకాశం ఉందని వైద్యులు చెబుతుండడం, కొన్ని చోట్ల ఇప్పటికే డెంగీ, మలేరియా ఇతర రోగాలతో ప్రజలు సతమతమవుతున్నారు. అయితే పారిశుధ్య నిర్వహణపై మేయర్, కమిషనర్ మొదలు జోనల్ క మిషనర్ల వరకు పారిశుధ్య నిర్వహణపై క్షేత్రస్థాయి తనిఖీలు జరపడం లేదు.
దీంతో రోజురోజుకు సమస్య మరింత తీవ్రమవుతోంది. గార్భేజ్ వల్నరబుల్ పాయింట్ల ను ఎత్తివేసిన చోట సమస్య మరింత ఎక్కువైంది. 2,640 జీవీపీలను గుర్తించి ఎత్తివేశామని చెబుతున్నా.. ఇంటికి స్వచ్ఛ ఆటోలు రానీ ప్రాంతాల వారు చెత్త ఎక్కడ వేయాలో తెలియక తిరిగి జీవీపీలు తొలగించిన చోటే పడేస్తున్నారు. కొందరు రాత్రి వేళల్లో దగ్గర్లోని రోడ్ల వెంట పారబోస్తున్నారు. డంపర్ బిన్లు ఏర్పాటు చేస్తామని హడావుడి చేసిన అధికారులు.. చాలా చోట్ల ఏర్పాటు చేయడంలో విఫలమయ్యారు. దీంతో చెత్త సమస్యపై బల్దియాకు ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. గ్రేటర్లో అన్ని ప్రాంతాల్లోనూ ఇదే సమస్య నెలకొంది.
శానిటేషన్ విభాగంలో మొత్తం 22,019 మంది ఉండగా, ఇందులో శానిటేషన్ వర్కర్లు ఔట్సోర్సింగ్ -18,343, పీహెచ్ వర్కర్స్ -2,365, ఎస్ఎఫ్ఏలు 952, శానిటరీ జవాన్లు-276, ఫీల్డ్ ఆఫీసర్లు (డీఈఈ/ఏఎంఓహెచ్) 29, ఎన్వీరాల్మెంటల్ స్పెషలిస్టులు 30, శానిటరీ సూపర్వైజర్స్/శానిటరీ ఇన్స్పెక్టర్లు
-24 మంది పనిచేస్తున్నారు.
గ్రేటర్లో తరచూ చెత్త వేసే ప్రాంతాలు (గార్భేజీ వనరేబుల్ పాయింట్లు/జీవీపీ) జీహెచ్ఎంసీ పరిధిలో 2,640 ప్రాంతాలను గుర్తించి వాటిని పూర్తి స్థాయిలో ఎత్తివేసేలా చర్యలు తీసుకుంటున్నామని చెబుతున్నారే తప్ప..క్షేత్రస్థాయిలో వీటికి అదనంగా కొత్తగా జీవీపీ పాయింట్లు పుట్టుకొస్తున్నాయి. వాస్తవంగా వర్షాకాలంలో వ్యర్థాలు త్వరగా కుళ్లి దుర్గంధం వెదజల్లే పరిస్థితులు ఎక్కువ. దీని చక్కదిద్దేందుకు , చెత్తను ఎప్పటికప్పుడు తరలించేందుకు వర్షాకాలంలో ప్రత్యేక ఏర్పాట్లు చేయడం లేదు.
వర్షాలొస్తే దోమలు, ఈగలు, క్రిమికీటకాలు వృద్ధి చెంది రోగాల భారిన పడి ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గత కమిషనర్లు సైతం స్వచ్ఛ ఆటోలు, పారిశుధ్య నిర్వహణలో నిర్లక్ష్యంపై కఠిన వ్యవహరించాలని ఆదేశించినా.. క్షేత్రస్థాయిలో నిర్ణయాలు అమలు కాకపోవడం గమనార్హం. ఈ నేపథ్యంలోనే చాలా చోట్ల రోడ్ల పక్క చెత్తి ఎత్తిన అనంతరం కనీసం బ్లీచింగ్ పౌడర్ కూడా చల్లడం లేదు. గతంతో పోలిస్తే బహిరంగ ప్రదేశాల్లో చెత్త కుప్పలు ఎక్కువగా కనిపిస్తున్నాయని స్వయంగా అధికారులే చెబుతుండడం గమనార్హం.
ఇంటింటి చెత్త సేకరణ లక్ష్యం అమలు కావడం లేదు. గ్రేటర్లో చెత్తరహిత నగరంగా తీర్చిదిద్దే చర్యల్లో భాగంగా దాదాపు మూడున్నరేళ్ల కిందట డస్ట్ బిన్ లెస్ సిటీ పేరుతో చెత్త కుండీలను జీహెచ్ఎంసీ ఎత్తేసింది. మెరుగైన పారిశుధ్య నిర్వహణకు పకడ్బందీ చేస్తూ వందకు వంద శాతం ఇంటింటి చెత్త సేకరణకు స్వచ్ఛ ఆటోల సంఖ్యను పెంచారు. సుమారు 5,250 స్వచ్ఛ ఆటోలు గతంలో ఉండగా..ప్రస్తుతం 4,500 మాత్రమే ఉన్నాయి. వీటిని 4,846 కాలనీల్లో 23 లక్షల గృహాల నుంచి రోజుకు 7,757ల మెట్రిక్ టన్నులకు పైగా చెత్త సేకరణ జరగాలి.
ఒకొక ఆటోకు కాలనీ వారీగా చూస్తే ఒకటి లేదా రెండు కాలనీలు గృహాల ప్రకారంగా గమనిస్తే ఒకొక అటోకు సుమారు 500 నుంచి 600 ఇళ్లను కేటాయించి, చెత్త సేకరణ జరపాలి. కానీ గడిచిన కొన్ని రోజులుగా స్వచ్ఛ ఆటోల పనితీరు సరిగా ఉండడం లేదు. చాలా కాలనీలకు రోజూ స్వచ్ఛ ఆటోలు రావడం లేదు. వందకు వంద శాతం స్వచ్ఛ ఆటోల అటెండెన్స్ ఉండడం లేదు. చాలా ప్రాంతాల్లోకి స్వచ్ఛ ఆటోలు రావడం లేదని స్థానికులు చెబుతున్నారు. ఆటోలు టైమ్‌కు రాకపోవడంతో తప్పని పరిస్థితుల్లో రోడ్ల వెంట పోస్తున్నామని గృహిణులు చెబుతున్నారు.