Ganja | మణికొండ, మార్చి 21 : నగర శివారు ప్రాంతంలోని నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలో గంజాయి ముఠా కలకలం రేపింది. గత కొన్ని రోజులుగా నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలో గంజాయి సరఫరా కేంద్రాలు రోజుకోటి వెలుగులోకి వస్తున్నాయి. ప్రధానంగా లేబర్ క్యాంపులు పలు కాలనీలు, అపార్ట్మెంట్లతోపాటు గ్రామాల్లోనూ గంజాయి విక్రయాలు విచ్చలవిడిగా కొనసాగుతుండడం విశేషం.
ఇటీవల పోలీస్ స్టేషన్ పరిధిలోని ఖానాపూర్ గ్రామంలో ఏకంగా మూడు కిలోల గంజాయి సంచిని ఎస్ఓటి పోలీసులు పట్టుకోగా, కోకాపేట గ్రామంలోని 450 గ్రాములు గంజాయిని విక్రయిస్తుండగా పట్టుకున్నారు. ఇది మరవక ముందే పుప్పాలగూడలో శుక్రవారం 650 గ్రాముల గంజాయి సీజ్ చేసినట్లు నార్సింగి ఇన్స్పెక్టర్ హరికృష్ణ రెడ్డి తెలిపారు. గంజాయి విక్రయిస్తుండగా శ్రీకాంత్ అనే యువకుడిని పుప్పాలగూడలో రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నట్లు వెల్లడించారు. ఈ మేరకు శ్రీకాంత్‌పై ఎన్డీపీఎస్ యాక్ట్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని నార్సింగి పోలీసులు తెలిపారు. ఆంద్రప్రదేశ్ అరకు నుండి గంజాయి తెచ్చినట్లు పోలీసుల ముందు నిందితుడు ఒప్పుకున్నట్లు ప్రాథమిక విచారణలో తేలిందని పోలీసులు తెలిపారు.
నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలో గత కొన్ని రోజులుగా విద్యార్థులు, కార్మికులే లక్ష్యంగా గంజాయి విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. ప్రధానంగా హాస్టల్లో కార్మిక కేంద్రాలు లక్ష్యంగా గంజాయి ముఠాలు కేంద్రాలను ఏర్పాటు చేసుకొని యదేచ్ఛగా అమ్ముతున్నారు. ఇందుకు అలవాటు పడిన యువత ప్రతిరోజు గంజాయి మత్తులో నవ్వుతూ రోడ్డు ప్రమాదాలు కుటుంబ కలహాలు తదితర గొడవలకు దిగుతూ శాంతి భద్రతలకు ఘాతం కలిగిస్తున్నారు. దీంతో పోలీసులు పట్టిష్టమైన చర్యలు తీసుకున్నందుకు రంగంలోకి దింపి గంజాయి ముఠాలపై ప్రత్యేక దృష్టి సాధించినట్లు ఇన్స్పెక్టర్ తెలిపారు.