అంబర్‌పేట, డిసెంబర్ 27 : ఇంట్లో ఎవరైనా చనిపోయి అంత్యక్రియలు చేయడానికి సైతం ఇబ్బందులు ఎదుర్కొంటున్న నిరుపేదలకు తాను ఉన్నానని ధైర్యం ఇస్తున్నారు అంబర్‌పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్. అంత్యక్రియలకు శ్మశానవాటికలో అవసరమైన ఖర్చులను తానే భరిస్తున్నారు. అంబర్‌పేట నియోజకవర్గంలో కాచిగూడ, నల్లకుంట, గోల్నాక, అంబర్‌పేట, బాగ్‌అంబర్‌పేట ఐదు డివిజన్లు ఉన్నాయి. ఆయా డివిజన్ల పరిధిలో అధికశాతం మురికి వాడలు, బస్తీలు ఉన్నాయి. బస్తీల్లో ఎక్కువగా పేదలు, నిత్యకూలీలు, బడుగు, బలహీన వర్గాల ప్రజలే ఎక్కువగా ఉన్నారు. వారికి ఏదో ఒక సహాయం చేయాలనే ఆలోచన ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్‌కు వచ్చింది. ఇంట్లో ఎవరైనా చనిపోయి అంత్యక్రియలు చేయడానికి ఇబ్బందులు పడుతున్న పేదవారికి సహాయం చేయాలని అనుకున్నారు. శ్మశానవాటిక ప్రబంధక కమిటీతో చర్చించి పేదల అంత్యక్రియల ఖర్చును తానే భరిస్తానని చెప్పారు. ఎవరైనా చనిపోయి అంత్యక్రియలకు సైతం డబ్బులు లేనివారు ఎమ్మెల్యే కార్యాలయంలో సంప్రదిస్తే వారు ఎమ్మెల్యే లెటర్ ప్యాడ్‌పై చనిపోయిన వారి పేరు, కుటుంబ సభ్యుల వివరాలు రాసి ఎమ్మెల్యే సంతకం చేసి వారికి లెటర్ ఇస్తారు. ఆ లెటర్‌ను శ్మశాన వాటికలో సంబంధిత మేనేజర్‌కు ఇస్తే వారికి ఉచితంగా అంత్యక్రియలు నిర్వహిస్తారు.
ఒక్కొక్కరికి 7 వేల వరకు ..
నియోజకవర్గంలో ఇప్పటి వరకు 300 మంది పేదల అంత్యక్రియలకు ఎమ్మెల్యే సహాయం చేశారు. ఒక్కొక్కరికి సుమారు రూ.6 నుంచి రూ.7వేల ఖర్చు అవుతుంది. నెలలో సుమారు 25 మంది అంత్యక్రియలకు సహాయం చేస్తున్నారు. నెల మొత్తం ఎంతమందికి లెటర్లు ఇచ్చి అంత్యక్రియలకు సహాయం చేశారో ఆ లెటర్లను శ్మశాన వాటిక మేనేజర్ తీసుకువచ్చి ఎమ్మెల్యే కార్యాలయంలో అప్పగిస్తారు. వాటిని పరిశీలించిన తరువాత మొదటి వారంలో ఎమ్మెల్యే తనకు ప్రభుత్వం ద్వారా వచ్చే వేతనంలో నుంచి ఆ డబ్బును శ్మశాన వాటిక సిబ్బందికి ఇస్తున్నారు. ఇలా ఇప్పటి వరకు 300 మంది నిరుపేదల అంత్యక్రియలకు సహాయం చేశారు.
ఇది అదృష్టంగా భావిస్తున్నా..
నిజంగా నిరుపేదల అంత్యక్రియలకు సహాయం చేయడాన్ని అదృష్టంగా భావిస్తున్నా. గతంలో ఒకరు నా వద్దకు అంత్యక్రియలకు సహాయం చేయాలని రావడంతో వారికి సహాయం చేశాను. అప్పుడు ఈ ఆలోచన వచ్చింది. అప్పటి నుంచి నిరుపేదల అంత్యక్రియలకు సహాయం చేయాలని నిర్ణయించుకున్నా. కరోనా సమయంలో కూడా చాలా మంది ఇబ్బందులు పడ్డారు. ఆ సమయంలో కూడా ఇలాగే సహాయం చేశా. దీన్ని కొనసాగిస్తా. నిజంగా అవసరమైన వారు ఇప్పటికి కూడానా కార్యాలయంలో సంప్రదిస్తే తగిన సహాయం చేస్తా. ఇదొక్కటే కాకుండా ఏ సమస్యతో వచ్చినా దాని పరిష్కారానికి చర్యలు తీసుకుంటా.
-కాలేరు వెంకటేశ్, ఎమ్మెల్యే, అంబర్‌పేట