సిటీబ్యూరో, ఆగస్టు 20 (నమస్తే తెలంగాణ) : గ్రేటర్‌లోని మురికి వాడల్లో నివసిస్తున్న యువతకు ఉపాధి అవకాశాలు కల్పించి సుస్థిరమైన జీవన ప్రమాణాలు పెంపొందించేందుకు జీహెచ్ఎంసీ కృషి చేస్తున్నది. 18 నుంచి 35 సంవత్సరాల వయస్సు గల వారందరికీ స్వయం ఉపాధితో పాటు వివిధ కంపెనీలలో ప్లేస్ మెంట్ ద్వారా ఉపాధి కల్పించేందుకు పుణేకు చెందిన లైట్ హౌస్ కమ్యూనిటీ ఫౌండేషన్ (ఎల్‌సీఎఫ్) సంస్థతో ఒప్పందం కుదుర్చుకోగా.. పలు చోట్ల ఎన్జీవోల భాగస్వామ్యంతో యువతకు శిక్షణ అందించి ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నది. ఇందులో భాగంగానే ఇప్పటి వరకు ఫౌండేషన్ కోర్సుకు 336 మంది ఎన్రోల్ చేసుకోగా.. ఇందులో శిక్షణ పూర్తి చేసుకున్న 103 మందికి పలు కార్పొరేట్ కంపెనీలలో ఉద్యోగ అవకాశం కల్పించారు.
శిక్షణతో పాటు ప్లేస్మెంట్ బాధ్యత
నర్సింగ్, కుకింగ్, బ్యూటీ పార్లర్, ఫిట్నెస్ ట్రైనర్.. సర్వీస్ ఓరియెంటెడ్ ప్రోగ్రామ్‌కు సంబంధించిన కోర్సుల్లో శిక్షణ కల్పిస్తారు. ఇవే కాకుండా అభ్యర్థులకు ఇష్టమైన కోర్సులు ఈ సంస్థ వద్ద లేకున్నా..వేరే ట్రైనింగ్ సెంటర్ ద్వారా శిక్షణ ఇప్పించి ఉపాధి కల్పిస్తారు. హైదరాబాద్‌లో భాగస్వామ్య దిగ్గజ సంస్థలతోపాటు ఇకడ స్థానికంగా ఉన్న కంపెనీలు, పరిశ్రమలతో భాగస్వామ్యం చేసుకోవాల్సి ఉంటుంది.
ప్రతి ఏటా 500 మందికి ఉచిత శిక్షణ
లైట్ హౌస్ ఫౌండేషన్ పుణే మున్సిపాలిటీలో 11వేల మంది నిరుద్యోగ యువత రిజిస్ట్రేషన్ చేసుకోగా.. 7,200 మందికి ప్లేస్ మెంట్‌తో పాటుగా స్వయం ఉపాధి కల్పించారు. ప్రతి ఏటా సుమారు 500 మందికి సర్టిఫికెట్ కోర్సుల్లో ఎలాంటి రుసుము లేకుండా ఉచితంగా శిక్షణ అందిస్తున్నారు.