సిటీబ్యూరో, మార్చి 13 (నమస్తే తెలంగాణ): తమతో పాటే పనిచేస్తుంటారు.. కొన్నాళ్లు స్నేహితులుగా ఉంటూ… ఆ తర్వాత నిన్ను ప్రేమిస్తున్నాను పెండ్లి చేసుకుంటానంటూ నమ్మిస్తారు. వారి మాటలు నమ్మి ఒకే చెబితే.. కొన్నాళ్లు కలిసి తిరిగి.. పెండ్లి ప్రస్తావన వచ్చేవరకు నీవెవరు.. అంటూ ముఖం చాటేస్తుంటారు.. ఇలాంటి వారిపై బాధితులు షీ టీమ్స్‌ను ఆశ్రయిస్తూ మోసం చేసిన వారికి బుద్ది చెబుతున్నారు. రాచకొండ షీ టీమ్స్‌కు బాధిత మహిళలు ఫిర్యాదులు చేస్తుండడంతో కేసులు నమోదు చేసి జైలుకు పంపిస్తున్నారు.
నెల రోజుల వ్యవధిలో రాచకొండ షీ టీమ్స్‌కు వచ్చిన ఫిర్యాదులు, రెడ్ హ్యాండెడ్‌గా 187 మంది పోకిరీలు పోలీసులకు దొరికిపోయారు. ఇందులో కేసుల తీవ్రతను బట్టి చర్యలు తీసుకున్నట్లు రాచకొండ ఉమెన్ సేఫ్టీ వింగ్ డీసీపీ ఉషా విశ్వనాథ్ వెల్లడించారు. బాలికలను, మహిళలను వేధించే పోకిరీలను వదిలి పెట్టేది లేదని, మహిళలు నిర్భయంగా ఫిర్యాదు చేయాలని షీ టీమ్స్ వెంటనే స్పందించి తగిన చర్యలు తీసుకుంటామని రాచకొండ సీపీ సుధీర్‌బాబు ప్రజలకు సూచిస్తున్నారు.
కమిషనర్ ఆదేశాలతో షీ టీమ్స్ ప్రతి రోజు బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, మెట్రో స్టేషన్లు, స్కూళ్లు, కాలేజీలు, కూరగాయల మార్కెట్లు, బహిరంగ ప్రదేశాలలో మఫ్టీలో తిరుగుతూ డెకాయి ఆపరేషన్లు చేస్తున్నాయి. ఇలా చేయడంతో గత నెలలో పట్టుబడ్డ 187 మంది పోకిరీలలో 122 మంది మేజర్లు, 65 మంది మైనర్లు ఉన్నారు. వీరికి ఎల్బీనగర్లోని సీపీ క్యాంప్ ఆఫీస్ ప్రాంగణలోని ఉమెన్ సేఫ్టివింగ్ ఆఫీసులో కౌన్సిలింగ్ నిర్వహించారు. గత నెలలో షీ టీమ్స్‌కు 241 ఫిర్యాదులు అందాయని, మహిళలు ధైర్యంగా ఫిర్యాదు చేస్తున్నారని డీసీపీ వెల్లడించారు.‚