కుత్బుల్లాపూర్, సెప్టెంబర్ 3 :ప్రభుత్వం ఉచితంగా అందజేసే డబుల్ బెడ్రూం ఇండ్లు ఇప్పిస్తామని వసూళ్లకు పాల్పడ్డారు. ఏ మాత్రం అనుమానం రాకుండా నకిలీ ధ్రువీకరణ పత్రాలు స్పష్టించి..అమాయకుల నుంచి రూ. లక్షల్లో దండుకున్నారు. సుమారు వంద మందిని మోసం చేసిన ఆ మోసగాళ్లు..ఎట్టకేలకు పోలీసులకు చిక్కారు. బాలానగర్ జోన్ డీసీపీ పద్మజారెడ్డి శుక్రవారం మీడియాకు వివరాలు వెల్లడించారు. ప్రకాశం జిల్లా పేరాల గ్రామానికి చెందిన బొమ్మిడం కుమార్ బాబు(35) నగరానికి వలస వచ్చి బోరబండలో ఉంటున్నాడు. 2008 నుంచి చిన్న చిన్న దొంగతనాలు చేస్తున్న ఇతడికి స్థానిక వ్యక్తి షేక్ సల్మాన్(23) తోడుగా నిలిచాడు. వీరిద్దరు గతంలో 13 కేసుల్లో నిందితులుగా ఉన్నారు.
తక్కువ సమయంలో ఎక్కువ సంపాదించాలనే ఆలోచనతో కుమార్ బాబు, సల్మాన్ ఈ దందా మొదలుపెట్టారు. ప్రధాన నిందితుడు కుమార్ ఏకంగా ఓ ఐడీని స్పష్టించుకొని.. హౌసింగ్ రీజినల్ మేనేజర్‌గా చెప్పుకున్నాడు. మీ సేవలో లభించే డబుల్ బెడ్రూం దరఖాస్తు పత్రాలు, ఆధార్, పాన్‌కార్డుతో పాటు లబ్ధిదారుడికి ఇచ్చే పట్టా ధ్రువీకరణ పత్రాల వరకు అన్నీ నకిలీవి తయారు చేశాడు. అమాయకులను బురిడీ కొట్టించేందుకు కుమార్, సల్మాన్ మీడియేటర్లను పెట్టుకొని మరీ మోసానికి తెరలేపారు. వారికి నకిలీ ధ్రువీకరణ పత్రాలు ఇచ్చి.. వారి ద్వారా ఇండ్లు ఇప్పిస్తామని నమ్మించేవారు. అలా పలువురి వద్ద భారీగా డబ్బులు వసూలు చేశారు.
అనుమానం రాకుండా ఇండ్లు కేటాయించినట్లు నకిలీ డాక్యుమెంట్లను సృష్టించి.. ఒక్కో బాధితుడి నుంచి రూ. 1.60 లక్షల నుంచి రూ. 6.30 లక్షల వరకు తీసుకున్నారు. సుమారు వంద మందిని వీరు మోసం చేశారు. నెలలు గడిచినా సమాధానం చెప్పకుండా తప్పించుకొని తిరుగుతుండటంతో సనత్‌నగర్, మియాపూర్ పోలీస్‌స్టేషన్‌లో పలువురు బాధితులు ఫిర్యాదు చేయగా, విషయం వెలుగులోకి వచ్చింది. రంగంలోకి దిగిన సైబరాబాద్ పోలీసులు, శంషాబాద్ ఎస్వోటీ జోన్ దర్యాప్తు బృందం ముమ్మర గాలింపులు చేపట్టి.. నిందితులను పట్టుకున్నది.
వారి ఇండ్లలో సోదాలు చేపట్టి రూ.37 లక్షల నగదు, రూ.15 లక్షల విలువ చేసే 30 తులాల బంగారు ఆభరణాలు, కారు, బైక్, మూడు సెల్ఫోన్లు, రెండు ల్యాప్‌టాప్, రీజినల్ మేనేజర్ స్టాంప్‌లు, నకిలీ పట్టా ధ్రువీకరణపత్రాలు వంటివి స్వాధీనం చేసుకున్నారు. కాగా, ఏ ప్రభుత్వ పథకమైనా.. లబ్ధిదారుడికే నేరుగా అందుతుందని, మధ్య దళారులను ఆశ్రయించి మోసపోవద్దని బాలనగర్ డీసీపీ పద్మజారెడ్డి సూచించారు. ఇలాంటి మోసాలకు పాల్పడుతున్న నేరస్తులపై పీడియాక్ట్ కేసు నమోదు చేస్తామన్నారు.