సిటీబ్యూరో, ఆగస్టు 28(నమస్తే తెలంగాణ): మౌలాలికి చెందిన ఓ మహిళ ఫోన్‌కు 22న ఎస్ఎంఎస్ వచ్చింది. అందులో ఆమెకు జాన్ సంస్థ అత్యవసరంగా పార్ట్-టైం ఉద్యోగాల కోసం ఎంపిక చేస్తున్నట్లు.. రోజుకు రూ.3 వేల నుంచి రూ.10వేలు సంపాదించవచ్చని ఓ లింక్‌ను ఇచ్చారు. ఆమె ఆ లింక్‌ను క్లిక్ చేసి.. వాట్సాప్ గ్రూపులోకి వెళ్లింది. అనంతరం మరో లింక్‌ను క్లిక్ చేసి.. అందులో రిజిస్టర్ అయింది. ఓ వ్యక్తి ఆమెను రూ.200 పెట్టుబడి పెట్టమన్నాడు. దీంతో బాధితురాలు ఫోన్‌పే నుంచి రేజర్ పేమెంట్ గేట్‌వే ద్వారా లింక్ పంపిన వ్యక్తికి డబ్బులు పంపింది. వెంటనే ఆమె బ్యాంక్ ఖాతాకు రూ.400 రావడంతో మరింత నమ్మకం పెరిగింది. ఈ నెల 24న బాధితురాలు సుమారు రూ. 7.20 లక్షలను పెట్టుబడిగా పెట్టింది. లాభం వచ్చినట్లు కనిపించినా.. విత్‌డ్రా చేసుకోవడానికి వీలు కాలేదు. మోసపోయానని గ్రహించి.. సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు దర్యాప్తులో ఉన్నది.