నేరేడ్మెట్, ఆగస్టు 26 : పూజల పేరుతో మోసం చేసిన వ్యక్తిని నేరేడ్మెట్ పోలీసులు అరెస్టు చేశారు. ఇన్స్పెక్టర్ నర్సింహస్వామి తెలిపిన వివరాల ప్రకారం.. ఆర్కేపురంలో ఉంటున్న రాకేశ్ (32) తన వద్ద శక్తి ఉందని, అమ్మవారికి పూజలు, మందులతో అనారోగ్యాలు, ఆర్థిక ఇబ్బందులను తొలగిస్తానని ప్రకటనలు ఇచ్చాడు. లోయర్ ట్యాంక్‌బండ్‌కు చెందిన శ్యామల తన కుమారుడి ఆరోగ్యం బాగలేదని రాకేశ్ వద్దకు వచ్చింది. అమ్మవారికి పూజలు, మందులతో నీ కుమారుడి ఆరోగ్యాన్ని బాగు చేస్తానని.. కొంత డబ్బులు ఖర్చు అవుతాయని చెప్పాడు. అతడి మాటలు నమ్మిన శ్యామల రూ.1.60 లక్షల నగదు, 5 తులాల బంగారాన్ని ఇచ్చింది. కొడుకుకు ఆరోగ్యం బాగుపడకపోవడంతో డబ్బులు, బంగారం వాపసు ఇవ్వాలని రాకేశ్‌ను అడిగితే తప్పించుకొని తిరుగుతున్నాడు. బాధితురాలు నేరేడ్మెట్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. గురువారం నిందితుడు రాకేశ్‌ను అరెస్ట్ చేశారు.