బంజారాహిల్స్,ఆగస్టు 11: స్థలం విక్రయం పేరుతో తప్పుడు పత్రాలతో రూ.5 కోట్లు వసూలు చేసి మోసం చేసిన నిందితుడిని జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. పోలీసుల కథనం ప్రకారం.. జూబ్లీహిల్స్ రోడ్ నం. 71లో నివాసముంటున్న వెన్నా సత్యనారాయణ తన స్నేహితులైన వెన్న రమణమూర్తి, లక్ష్మారెడ్డి, శ్రీహరితో కలిసి శంకర్పల్లి మండలం కొండకల్ గ్రామంలోని లహరీ గ్రీన్‌పార్క్ లే అవుట్లో స్థలం కొనుగోలు చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో రియల్ ఎస్టేట్ ఏజెంట్లు శ్రీకాంత్‌రెడ్డి, వెంకట్‌రెడ్డి ద్వారా కరీంనగర్ పట్టణానికి చెందిన పుట్టపాక శ్రీనివాస్‌తో పరిచయం ఏర్పడింది. సదరు స్థలానికి సంబంధించి యజమాని కంచర్ల రమణ అనే మహిళతో పాటు ఆమె కొడుకు దుర్గా ప్రసాద్‌లతో తనకు ఒప్పందం ఉందంటూ.. పుట్టపాక శ్రీనివాస్ కొన్ని పత్రాలు చూపించడంతో పాటు స్థలాన్ని విక్రయిస్తానంటూ అగ్రిమెంట్ చేశాడు. దీనికోసం రూ.5.05కోట్లను అడ్వాన్స్‌గా తీసుకున్నాడు.
అయితే నెలలు గడిచినా రిజిస్ట్రేషన్ మాటెత్తకపోగా.. శ్రీనివాస్ ముఖం చాటేశాడు. ఫోన్లు చేసినా పట్టించుకోకపోవడంతో ఆరా తీయగా అతడి వద్ద ఉన్న పత్రాలు ఫోర్జరీవి అని తేలింది. తాము అడ్వాన్స్‌గా చెల్లించిన డబ్బులు తిరిగి ఇవ్వాలని అడిగేందుకు వెళ్లిన వెన్న సత్యనారాయణ, రమణమూర్తిలు తనను కిడ్నాప్ చేశారంటూ.. ఇటీవల శ్రీనివాస్ తప్పుడు ఫిర్యాదులు చేశాడు. దీంతో తమను ఉద్దేశ్యపూర్వకంగా మోసం చేయడంతో పాటు తప్పుడు కేసులు పెట్టిన పుట్టపాక శ్రీనివాస్‌పై చర్యలు తీసుకోవాలంటూ వెన్న సత్యనారాయణ ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన జూబ్లీహిల్స్ పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. కరీంనగర్లో కూడా శ్రీనివాస్‌పై పలు కేసులు నమోదయ్యాయని విచారణతో తేలింది.