సిటీబ్యూరో, ఆగస్టు 9 (నమస్తే తెలంగాణ): కార్లు అమ్మినట్లు నకిలీ ఇన్వాయిస్లు తయారు చేసి బ్యాంకుల నుంచి రుణాలు పొంది భారీ మోసాలకు పాల్పడుతున్న తల్వార్ కార్స్ ప్రైవేట్ లిమిటెడ్ నిర్వాహకుడు సాకేత్ తల్వార్‌ను సీసీఎస్ పోలీసులు గోవాలో అరెస్ట్ చేశారు. జాయింట్ సీపీ అవినాశ్ మహంతి కథనం ప్రకారం.. సుల్తాన్‌బజార్‌లోని కెనరా బ్యాంకు నుంచి కొందరు వోల్వో కారు కొనేందుకు రూ. 95 లక్షల రుణం తీసుకున్నారు. కారు అమ్మినట్లుగా తల్వార్ కార్స్ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి ఇన్వాయిస్లు, ఇన్సూరెన్స్ పేపర్లు బ్యాంకుకు పంపించారు. రుణం పొందిన వారు బ్యాంకులకు అప్పు చెల్లించకపోవడంతో అధికారులు వాహనం గురించి ఆరా తీశారు. ఆర్టీఏ విభాగంలో ఎలాంటి రిజిస్ట్రేషన్లు లేకపోవడంతో కారు కొన్నవాళ్లు, తల్వార్ కార్స్ నిర్వాహకులు కలిసి బ్యాంకును మోసం చేశారంటూ..ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన సీసీఎస్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. బంజారాహిల్స్‌లో నివాసముండే తల్వార్ కార్స్ నిర్వాహకుడు సాకేత్ తల్వార్‌పై నగరంలో 8 కేసులు నమోదైనట్లు గుర్తించారు. పక్కా ప్లాన్‌తో సాకేత్ తల్వార్ ఈ మోసాలకు పాల్పడుతున్నట్లు నిర్ధారించిన పోలీసులు నిందితుడి కోసం గాలింపు చేపట్టారు. ఈ క్రమంలో గోవా బీచ్‌లో అరెస్ట్ చేసి నగరానికి తరలించారు.