ఖైరతాబాద్, ఆగస్టు 8 : లేని స్థలం ఉన్నట్లు నమ్మించి ఓ వ్యక్తికి రూ. 50 లక్షలు టోకరా వేశాడు. పంజాగుట్ట ఎస్సై శివకృష్ణ తెలిపిన వివరాల ప్రకారం… పంజాగుట్టలోని ఊర్వశీ బార్ అండ్ రెస్టారెంట్ మేనేజింగ్ డైరెక్టర్ యుగేంధర్‌కు 2017లో సైనిక్‌పురికి చెందిన విక్రమ్ అమలనాథన్ (45) పరిచయమయ్యాడు. తాను కన్స్ట్రక్షన్ బిజినెస్ చేస్తానని, తనకు కాప్రా వద్ద ఏడు ఎకరాల స్థలం ఉందని, సరసమైన ధరకు విక్రయిస్తానని నమ్మబలికాడు. ముందుగా అడ్వాన్స్ ఇవ్వాలని, రిజిస్ట్రేషన్ చేయిస్తానని చెప్పుకొచ్చాడు. అతడి మాటలు నమ్మిన యుగేంధర్ బ్యాంకు ద్వారా ఆన్లైన్లో రూ.50 లక్షలు చెల్లించాడు. నాలుగేండ్లుగా విక్రమ్ తిప్పించుకుంటూ.. చివరికి ముఖం చాటేశాడు. అతడి గురించి ఆరా తీయగా కాప్రాలో స్థలమే లేదని బాధితుడు గుర్తించాడు. తాను మోసపోయానని ఆలస్యంగా గ్రహించిన యుగేంధర్ గత నెల 30న పోలీసులకు ఫిర్యాదు చేయగా, పరారీలో ఉన్న విక్రమ్‌పై సెక్షన్ 420, 406 కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితుడిని ఆర్కేపురం వద్ద అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు పోలీసులు తెలిపారు.