అడ్డగుట్ట, అక్టోబర్ 4: జల్సాలకు అలవాటు పడి.. వరుసగా బైక్ దొంగతనాలకు పాల్పడుతున్న ఓ వ్యక్తిని చిలకలగూడ పోలీసులు అరెస్టు చేసి, రిమాండ్‌కు తరలించారు. చిలకలగూడ పీఎస్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఈస్ట్‌జోన్ అడిషనల్ డీసీపీ నర్సయ్య వివరాలు వెల్లడించారు.
బోయిగూడ ప్రాంతానికి చెందిన అబ్రహం జానీ (48) 1996లో హోంగార్డుగా విధుల్లో చేరాడు. ఉద్యోగంలో చేరే సమయంలో అతడు నకిలీ పత్రాలు ఇవ్వడంతో 2015లో పోలీస్ శాఖ నుంచి తొలగించారు. ఆ తర్వాత మారుతీ సర్వీసింగ్ సెంటర్, నిక్సా సర్వీసింగ్ సెంటర్లో సుమారు ఏడేండ్ల పాటు పనిచేశాడు.
పలు కారణాలతో ఉద్యోగాల నుంచి తొలగించడంతో.. అప్పటి నుంచి మద్యం, గంజాయికి బానిసయ్యాడు. సులువుగా డబ్బులు సంపాదించేందుకు ఆస్పత్రులు, మద్యం దుకాణాలను లక్ష్యంగా చేసుకున్నాడు. అక్కడ పార్కింగ్ చేసిన ద్విచక్ర వాహనాలను దొంగిలించడం ప్రారంభించాడు. దొంగిలించిన వాహనాలను పార్శిగుట్ట ప్రాంతానికి చెందిన ఆంజనేయులుకు విక్రయించాడు. అయితే, గాంధీ ఆస్పత్రి నుంచి అధికంగా ఫిర్యాదులు రావడంతో.. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. అబ్రహం, ఆంజనేయులును అరెస్టు చేసి, రూ.5 లక్షల విలువ చేసే 8 బైక్‌లను స్వాధీనం చేసుకున్నారు.