సిటీబ్యూరో, ఫిబ్రవరి 8 (నమస్తే తెలంగాణ) : ప్రతిష్టాత్మకమైన ఉస్మానియా యూనివర్సిటీ నేషనల్ అసెస్మెంట్ అండ్ అక్రిడిటేషన్ కౌన్సెల్ (న్యాక్) నాలుగో సైకిల్ గుర్తింపు పొందడానికి కసరత్తు మొదలు పెట్టింది. అందుకు సంబంధించి ఓయూ వీసీ ప్రొఫెసర్ రవీందర్ ఆధ్వర్యంలో అన్ని విభాగాలకు చెందిన టీచింగ్ సిబ్బందితో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. న్యాక్ డైరెక్టర్ ప్రొఫెసర్ శిరీష ఆధ్వర్యంలో 16 మంది సభ్యులతో కమిటీ ఏర్పాటు చేశారు. ఇందులో ఓయూలోని వివిధ విభాగాలకు చెందిన ప్రొఫెసర్లతో పాటు పారిశ్రామిక వేత్తలు, పూర్వ విద్యార్థులు సభ్యులుగా ఉన్నారు.
ఆరు నెలలు ముందుగానే..!
2017లో ఉస్మానియా యూనివర్సిటీకి న్యాక్ ఏ ప్లస్ గుర్తింపు వచ్చింది. ఇది వచ్చే ఏడాది నవంబర్లో ముగియనున్నది. ఈ క్రమంలో న్యాక్ గుర్తింపు గడువు ముగియడానికి ఆరు నెలలు ముందుగానే న్యాక్ నాలుగో సైకిల్ గుర్తింపు కోసం తయారు చేసిన ఎస్ఎస్ఆర్ను సమర్పించాల్సి ఉంటుంది. ఎస్ఎస్ఆర్ తయారు చేయడానికి 16 మంది సభ్యులతో ఏర్పాటైన న్యాక్ కమిటీ పనులు మొదలు పెట్టినట్లు ఓయూ వైస్ చాన్స్లర్ ప్రొఫెసర్ రవీందర్ యాదవ్, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ లక్ష్మీనారాయణ తెలిపారు.
న్యాక్ గుర్తింపు ఉంటేనే నాణ్యమైనవి..
న్యాక్ గుర్తింపు అనేది యూనివర్సిటీలకు, ఉన్నత విద్యా సంస్థలకు ఇప్పుడు తప్పనిసరిగా మారింది. ఎక్కువ మంది విద్యార్థులు న్యాక్ గుర్తింపు ఉన్న కాలేజీలు, యూనివర్సిటీలలో ప్రవేశాలు పొందడానికి ముందుకు వస్తున్నారు. ఈ విద్యా సంస్థలన్నీ నాణ్యతా ప్రమాణాలకు కొలమానంగా మారుతున్నాయి.