ఉప్పల్, మే16: ఉప్పల్ ప్రాంతంలో ట్రాఫిక్ చిక్కులు తీర్చడానికి తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఇప్పటికే ఎలివేటెడ్ కారిడార్, స్కైవాక్, మెట్రో సేవలు అందుబాటులోకి తీసుకువచ్చిన ప్రభుత్వం మరో అడుగు ముందుకు వేసింది. ట్రాఫిక్ సమస్యలు పూర్తిగా తొలగించడానికి ఉప్పల్ ప్రాంతంలో మూడు ఫ్లైఓవర్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ మేరకు పనులు ప్రారంభం కానున్నాయి. యాదాద్రి, వరంగల్‌కు ప్రధాన రహదారి కావడంతో ప్రత్యేక దృష్టిసారించారు. ఉప్పల్ రింగ్‌రోడ్డు ప్రాంతంలో తెలంగాణ ప్రభుత్వం ఫ్లైఓవర్ పనుల కోసం రూ.450 కోట్లు కేటాయించింది. ఈ పనులతో ఉప్పల్ ప్రాంతంలో ట్రాఫిక్ సమస్యకు శాశ్వత పరిష్కారం లభించనున్నది. నాగోల్-సికింద్రాబాద్ వైపు రెండు ఫ్లైఓవర్ల నిర్మాణం చేపట్టనున్నారు. దీంతో ఉప్పల్ రింగ్‌రోడ్డుపై భారం తగ్గనున్నది. ఈ జంక్షన్లో పూర్తిస్థాయిలో ట్రాఫిక్ సమస్యకు విముక్తి లభించనున్నది. ఉప్పల్ రింగ్ రోడ్డులో రూ.450 కోట్లతో ఫ్లైఓవర్ పనులు చేపడుతున్నారు. వీటిలో రూ.311కోట్ల పనుల కోసం కేటాయించగా, మిగతా నిధులు ల్యాండ్ సేకరణ కోసం వినియోగించనున్నారు. ఉప్పల్ మెట్రోరైల్ బ్రిడ్జి పైనుంచి ఫ్లైఓవర్ నిర్మాణం చేపట్టనున్నారు. ఉప్పల్ క్రికెట్ స్టేడియం రోడ్డుకు అనుసంధానిస్తూ, సికింద్రాబాద్ వైపుగా రహదారికి కలుపుతున్నారు. దీంతో ట్రాఫిక్‌కు ఎలాంటి అంతరాయం ఉండదు.
ట్రాఫిక్ సమస్యలకు శాశ్వత పరిష్కారం
ఉప్పల్ అంటే ట్రాఫిక్ తిప్పల్ అనేవారు. కానీ నేడు ఉప్పల్ ప్రాంతం అంతర్జాతీయ హంగుల తో తీర్చిదిద్దబడుతుంది. ఉప్పల్‌లో ట్రాఫిక్ సమస్య శాశ్వతంగా పరిష్కారమవుతుంది. ఉప్పల్ రింగ్‌రోడ్డులో ట్రాఫిక్‌కు ఎలాంటి ఇబ్బందులు లేకుండా, ఫ్లైఓవర్ల నిర్మాణం చేపడుతున్నాం. నాగోల్-సికింద్రాబాద్ రోడ్లకు ఇరువైపులా ఫ్లైఓవర్లు, ఘట్కేసర్-రామంతాపూర్ రోడ్డులో ఎలివేటెడ్ కారిడార్‌కు అనుసంధానంగా ఫ్లైఓవర్ నిర్మా ణం చేపడుతున్నారు. దీంతో పూర్తిస్థాయిలో ట్రాఫిక్ బాధలు తీరుతాయి.
– బేతి సుభాష్‌రెడ్డి, ఎమ్మెల్యే