సిటీబ్యూరో, ఆగస్టు 18(నమస్తే తెలంగాణ): రామంతపూర్‌లోని గోఖలేనగర్ ప్రాంతంలో చోటుచేసుకున్న విషాద ఘటనలో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. అయితే ప్రమాదానికి కారణం కేబుల్ వైర్ అని విద్యుత్ శాఖ చెబుతుండగా, అధికారుల నిర్లక్ష్యం కారణంగానే ఈ ఘటన జరిగిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. అయితే ఘటనాస్థలాన్ని పరిశీలిస్తే ఆ ప్రాంతమంతా కేబుల్ చుట్టలే. ఎక్కడ చూసినా స్తంభాలకు వేలాడుతున్న వైర్లు, చుట్టలుచుట్టలుగా కనిపించిన తీగలు.
ఇవి ఇంటర్నెట్, కేబుల్ టీవీకి సంబంధించినవే అయినా వాటిని అమర్చిన విధానం మాత్రం ప్రమాదకర స్థితిలో ఉంది. వీటివల్ల విద్యుత్ ప్రమాదాలు జరుగుతాయని హెచ్చరించాల్సిన అధికారులు, హైటెన్షన్ వైర్ల సమీపంలో ఏర్పాటుచేసిన వాటిని ఎప్పటికప్పుడు సమీక్షించాల్సిన సిబ్బంది.. నిద్రావస్థలో ఉన్నారనడానికి ఈ ఘటనే పెద్ద ఉదాహరణ.
అంతెందుకు…ఘటన జరిగిన సమయంలోనూ విద్యుత్ సిబ్బంది ఆ చుట్టుపక్కలే ఉన్నారని స్థానికులు చెబుతున్నారు. రాబోయే రోజులన్నీ ఉత్సవాలు, శోభాయాత్రలే ఉంటాయి. గణపతి నవరాత్రులు, వినాయక నిమజ్జనం, దుర్గా నవరాత్రుల్లో పెద్ద ఎత్తున విగ్రహాల ఊరేగింపు ఉంటుంది. ఇటువంటి ఘటనల పట్ల అప్పటి వరకే అప్రమత్తమైనట్లు ఉండే అధికార యంత్రాంగం శాశ్వత ప్రాతిపదికన ప్రమాద నివారణ చర్యలు చేపట్టాలని స్థానికులు డిమాండ్ చేశారు.
ప్రాణాంతకంగా కేబుళ్లు
హైదరాబాద్ మహానగరంలోని ఏ కాలనీలో చూసినా సాలెగూళ్లను తలపిస్తున్న కేబుళ్ల కుప్పలు ప్రాణాంతకంగా మారుతున్నాయి. విద్యుత్ స్తంభాలకు వేలాడుతూ.. హైటెన్షన్ వైర్లపై నుంచి లాగి కనిపిస్తూ ప్రజల ప్రాణాలకు ముప్పు తెస్తున్నాయి. విద్యుత్ స్తంభాలపై కేవలం నాలుగు వరుసలతో మాత్రమే కరెంట్ తీగలు ఉంటే.. ఆ స్తంభాలపై 20 నుంచి 30 వరుసలతో కూడిన కేబుల్ వైర్లు వేలాడుతూ కనిపిస్తున్నాయి. ఇంటర్నెట్, కేబుల్ నెట్ వర్క్ సంస్థలు ఇష్టారాజ్యంగా స్తంభాలకు కేబుళ్లను చుట్టేస్తున్నాయి.. ఇందుకు స్పష్టమైన నిబంధనలు ఉన్నప్పటికీ వాటి ఉల్లంఘన జరుగుతూనే ఉంది.
అయినా సంబంధిత అధికారులు మాత్రం పట్టింపులేకుండా ఉంటున్నారు. వాటిని తమ అవసరాల నిమిత్తం ఏర్పాటు చేసి ఆ తర్వాత నిర్వహణ గాలికొదిలేయడంతో అవి గాల్లో వేలాడుతూ ప్రజలకు ప్రాణాంతకంగా మారుతున్నాయి. కేబుళ్ల ఏర్పాటు, నిర్వహణ తదితర విషయాల్లో సమన్వయంతో వ్యవహరించాల్సిన ప్రభుత్వశాఖలు నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో క్షేత్రస్థాయిలో లైన్ల నిర్వహణలో పెద్దగా పట్టింపు కనిపించడం లేదు. భారీ వాహనాలు వెళ్లే సమయంలో కిందకు వేలాడుతున్న కేబుళ్లు తెగి..విద్యుత్ వైర్లకు తాకి.. మెరుపులు కూడా వస్తున్న ఘటనలు జరిగినా..విద్యుత్, మున్సిపల్ సిబ్బంది మాత్రం పట్టింపులేకుండా ఉంటున్నారు.
ఎన్ని సార్లు సమావేశమైనా..
టీజీఎస్పీడీసీఎల్ పరిధిలోని విద్యుత్ స్తంభాలపై అడ్డదిడ్డంగా, సాధారణ ప్రజలకు ప్రాణాంతకంగా మారిన కేబుళ్లను తొలగించాలంటూ కేబుల్ ఆపరేటర్లు, ఇంటర్నెట్ ప్రొవైడర్లను సీఎండీ ముషారఫ్ ఫరూఖీ ఆదేశాలు జారీ చేశారు. గతంలో అనేక సార్లు కేబుల్ ఆపరేటర్లు, ఇంటర్నెట్ ప్రొవైడర్లతో సమావేశాలు నిర్వహించారు. హైదరాబాద్‌లోని 28 కంపెనీలకు చెందిన వారితో చర్చించారు. ఈ తొలగింపు ప్రక్రియలో తాము కచ్చితంగా ముందుంటామని మాట ఇచ్చిన కొన్ని కంపెనీలు ఆ పనిచేసినా, చాలా చోట్ల మాత్రం ఆ పరిస్థితి లేదు. ఏకంగా హైటెన్షన్ వైర్లపైనే తమ కేబుళ్లు వేసి మరీ కనెక్షన్ ఇస్తున్నారు. అవి తెగి తీగలపై పడడంతో కరెంట్ సరఫరా జరిగి షాక్ వచ్చే ప్రమాదముంది. నేలపై పడితే ట్రిప్ అవుతుంది కానీ అదే మనుషులపై పడితే ప్రాణాలే కోల్పోతారనడానికి గోఖలేనగర్ ఘటనే ప్రధాన నిదర్శనంగా నిలుస్తోంది. ఈ కేబుల్ డ్రైవ్ చేపట్టి అన్ని కేబుల్స్ తొలగించి ప్రాణాపాయం లేకుండా చూస్తామని మంత్రులు, అధికారులు చెబుతున్నా అది మూణ్ణాళ్ల ముచ్చటగానే మిగిలిపోతోందని కాలనీల వాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
అనవసర కేబుళ్లు తొలగించాలి..
– ఎస్పీడీసీఎల్ సీఎండీ
విద్యుత్ స్తంభాలపై, వైర్లపై ఏర్పాటు చేసిన అనవసర కేబుళ్లు, వస్తువులను వెంటనే తొలగించాలని ఎస్పీడీసీఎల్ సీఎండీ ముషారఫ్ ఫరూఖి ఆయా సంస్థలకు ఆదేశాలిచ్చారు. ఎన్నిసార్లు హెచ్చరించినా మొండిగా వ్యవహరిస్తున్నారని, వినియోగదారులకు ఇబ్బంది కలుగవద్దనే ఉద్దేశంతో సమయమిచ్చినా కేబుల్స్ తొలగించడం లేదని, ఇదే పరిస్థితి కొనసాగితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
సీఎండీ ఘెరావ్
గోఖలేనగర్ ఘటనకు బిల్డింగులను అనుసంధానం చేస్తూ ఏర్పాటు చేసిన కేబుల్ వైరే ప్రధాన కారణమని ఈ ఘటనపై లోతైన దర్యాప్తు చేస్తామని టీజీఎస్పీడీసీఎల్ సీఎండీ ముషారఫ్ ఫరూఖీ అన్నారు. సోమవారం రామంతపూర్‌లోని గోఖలేనగర్‌లో జరిగిన విద్యుత్ ప్రమాద ఘటనాస్థలాన్ని అధికారులతో కలిసి సందర్శించారు. ఘటనకు కారణాలపై విద్యుత్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. రెండు బిల్డింగులను అనుసంధానం చేస్తూ నిరుపయోగంగా పడి ఉన్న స్టార్ కేబుల్ వైర్ తెగి 11 కేవీ ఓవర్హెడ్లైన్ మీదుగా జారీ ఐరన్ ఫ్రేమ్‌తో రూపొందించిన రథానికి తగిలిందని, ఆ కేబుల్‌లో ఉన్న కాపర్‌వైర్ ద్వారా విద్యుత్ ప్రసరణ జరిగి ప్రమాదం చోటు చేసుకుందని ఆయన తెలిపారు.
ఘటన జరిగిన ప్రదేశంలో 11కేవీ లైన్ 20 అడుగుల కంటే ఎత్తులో ఉన్నదని, దీనికి తోడు గతంలోనే ఎల్టీ ఓవర్హెడ్లైన్ స్థానంలో ఏబీ కేబుల్స్ అమర్చామన్నారు. ఈ ఘటనపై దర్యాప్తు చేసి నివేదిక ఇవ్వాలని హబ్సిగూడ ఎస్ఈ ప్రతి మషోమ్ను ఆదేశించారు. మరోవైపు ముషారఫ్ ఫరూఖీని స్థానికులు ఘెరావ్ చేశారు. విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం వల్లే ఈ ఘటన జరిగిందని, తాము మొదటి నుంచీ చెబుతున్నా సిబ్బంది పట్టించుకోలేదని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. కాలనీలో ఎక్కడ చూసినా ఇదే పరిస్థితి ఉందని, తాము చాలాసార్లు ఫిర్యాదు చేసినా సిబ్బంది పెద్దగా స్పందించలేదని, ప్రమాదం జరిగినప్పుడు వచ్చి వెళ్లిపోతారని, ఆతర్వాత ఇక్కడి సమస్యలే పట్టించుకోరంటూ వారు సీఎండీని నిలదీశారు.
ఇంటర్నెట్, కేబుల్ టీవీ తీగల తొలగింపు
మేడ్చల్, ఆగస్టు 18 : నగరంలోని రామంతాపూర్‌లోని గోఖలేనగర్‌లో ఆదివారం నిర్వహించిన శ్రీకృష్ణ శోభాయాత్ర సందర్భంగా విద్యుత్దాఘాతానికి గురై ఐదుగురు మృతి చెందిన నేపథ్యంలో మేడ్చల్ పట్టణంలో విద్యుత్ స్తంభాలకు ఉన్న కేబుళ్ల తొలగింపునకు విద్యుత్ శాఖ చర్యలు చేపట్టింది. విద్యుత్ శాఖ ఉన్నతాధికారుల నుంచి వచ్చిన ఆదేశాల మేరకు సోమవారం సాయంత్రం స్తంభాలకు ఉన్న ఇంటర్నెట్, కేబుల్ టీవీ తీగలను తొలగించారు.
స్తంభాలకు ఉన్న తీగలను ఎక్కడికక్కడే కట్ చేశారు. కాగా విద్యుత్ శాఖ అధికారులు ఎలాంటి ముందస్తు నోటీసులు ఇవ్వకుండా అన్యాయంగా కేబుళ్లను తొలగించడంతో తమకు తీవ్ర నష్టం జరిగిందని మేడ్చల్ కేబుల్ ఆపరేటర్స్ అసోసియేషన్ ఒక ప్రకటన విడుదల చేస్తూ పేర్కొంది. ఇందుకు నిరసనగా మంగళవారం మేడ్చల్ పట్టణంలో ఉదయం నుంచి సాయంత్రం వరకు ఇంటర్నెట్, కేబుల్ టీవీ సేవలను పూర్తిగా నిలిపివేస్తున్నామని అసోసియేషన్ సభ్యులు ఉపేందర్, రాఘవేందర్, శ్రీనివాస్, నాయక్, చంద్రశేఖర్ తెలిపారు.
సిటీలో ఇదీ పరిస్థితి
జీహెచ్ఎంసీ పరిధిలోని సర్కిల్స్, పారిశ్రామిక వాడల్లోని చాలా ప్రాంతాల్లో రహదారులు, కూడళ్లలోని స్తంభాలకు వివిధ సంస్థలు నిబంధనలు పాటించకుండా కేబుళ్లు ఏర్పాటు చేస్తున్నాయి. గత సంవత్సరం గ్రేటర్‌లోని పలు ప్రాంతాల్లో డిస్కం లైన్ టు లైన్ సర్వే నిర్వహించింది. 11 కేవీ ఫీడర్లు 3285లో 4,46,540 పాయింట్లలో తనిఖీలు చేపట్టింది. 12,598 విద్యుత్ స్తంభాలు, 1320 డీటీఆర్లు ప్రమాదకర స్థితిలో ఉన్నట్లు గుర్తించింది. మెజార్టీ స్థంభాలకు కిలోల కొద్దీ కేబుళ్లు వేలాడుతున్నట్లు వారి తనిఖీల్లో వెల్లడైంది. ప్రొవైడర్లు తాము కొత్తవి అమర్చే సమయంలో పాత కేబుళ్ల చుట్టలను అక్కడే వదిలేస్తున్నారు. కాలనీ దారుల్లో చేతులకు అందే ఎత్తులలో కేబుళ్లు వేలాడుతూ ప్రమాదాలకు కారణమవుతున్నాయి. రోడ్లపై, దుకాణాలు, మలుపుల వద్ద కిందికి ఉంటున్న తీగలు, వాటి చుట్టల కారణంగా రాత్రి వేళ వాహనదారులు, పాదచారులు ప్రమాదాల బారిన పడుతున్నారు.
ఇవీ నిబంధనలు..!