మేడ్చల్, మే 1 : కంటికి రెప్పలా కాపాడాల్సిన తండ్రే మృగంగా మారాడు. కామంతో కండ్లు మూసుకుపోయి కూతురి(14)పైనే లైంగిక దాడికి ఒడిగట్టాడు. అంతటితో ఆగకుండా విషయం ఎవరికైనా చెబితే చంపివేస్తానని బెదిరించాడు. ఈ ఘోరమైన నేరానికి పాల్పడిన తండ్రికి 62 ఏండ్ల జైలు శిక్ష విధిస్తూ న్యాయమూర్తి సంచలన తీర్పు వెలువరించారు.
జైలు శిక్షతో పాటు రూ.35వేల జరిమానా విధించారు. అలాగే బాధితురాలికి రూ.3 లక్షలు జిల్లా న్యాయసేవా సంస్థ నుంచి పరిహారం ఇవ్వాలని తీర్పులో చెప్పారు. స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ప్రభాకర్‌రెడ్డి తెలిపిన ప్రకారం…బీహార్ రాష్ర్టానికి చెందిన ఓ వ్యక్తి(35) నగరానికి కుటుంబంతో సహా వలస వచ్చి, జీడిమెట్ల పోలీస్‌స్టేషన్ పరిధిలోని సుభాష్‌నగర్‌లో నివాసం ఉంటున్నాడు. అతడికి భార్యా, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. నిందితుడు, అతడి భార్య కూలీ పనులు చేస్తుండగా, ఇద్దరు కూతుళ్లు చదువుకుంటున్నారు. గత ఏడాది ఏప్రిల్‌లో కూతుళ్లు ఇంట్లో ఉండగా తల్లి ఇండ్లల్లో పని చేసేందుకు వెళ్లింది. ఆ సమయంలో చిన్న కూతురును పాలు తీసుకురావాలని తండ్రి బయటికి పంపించాడు.
ఆమె ఇంట్లో నుంచి వెళ్లగానే అతడు పెద్ద కూతురిపై లైంగిక దాడి చేశాడు. అంతటితో ఆగకుండా తాము నివాసం ఉండే మేడ పైకి కూతురును తీసుకెళ్లి విషయం ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించాడు. ఈ విషయాన్ని గుర్తించిన చిన్న కూతురు.. తండ్రిని ఎందుకు అక్కను బెదిరిస్తున్నారని ప్రశ్నించగా, వేరే సంబంధం పెట్టుకుందని కూతురిపైనే అంభాండాలు వేసే ప్రయత్నం చేశాడు. ఈ సందర్భంగా అక్క.. చెల్లికి జరిగిన విషయాన్ని చెప్పింది. పని పూర్తి చేసుకొని ఇంటికి వచ్చిన తల్లికి చిన్న కూతురు ఈ విషయం చెప్పింది. ఆమె పెద్ద కూతురిని ఆరా తీయగా, ఇదే మొదటి సారి కాదని, గతంలో కూడా ఇలా రెండు మూడు సార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడని వెల్లడించింది.
బాధతో తల్లిడిల్లిపోయిన ఆమె తన భర్తకు శిక్ష పడాల్సిందేనని, అదే ఏడాదికి మే 6న జీడిమెట్ల పోలీస్‌స్టేషన్‌ను ఆశ్రయించింది. ఆమె ఫిర్యాదుతో పోక్సోతో పాటు పలు సెక్షన్ల కింద సీఐ గడ్డం మల్లేశ్ కేసు నమోదు చేశారు. నిర్ణీత గడువు కుంటే ముందుగానే విచారణ పూర్తి చేసి, మేడ్చల్ ఫాస్ట్‌ట్రాక్ కోర్టులో చార్జీషీటు దాఖలు చేశారు. ఈ కేసు శుక్రవారం తుది విచారణకు వచ్చి, నిందితుడిపైన మోపిన అభియోగం రుజువు కావడంతో న్యాయమూర్తి వెంకటేశ్ సంచలన తీర్పు వెలువరించారు. లైంగికదాడికి 20 ఏండ్ల జైలు శిక్ష, రూ.10వేల జరిమానా, మైనర్‌పై లైంగిక దాడి చేసినందుకు 20 ఏండ్ల జైలు శిక్ష, రూ.10వేల జరిమానా, కూతురిపై అఘాయిత్యం చేసినందుకు 20 ఏండ్ల జైలు శిక్ష, రూ.10వేల జరిమానా, బెదిరింపులకు పాల్పడినందుకు 2 ఏండ్ల జైలు శిక్ష, రూ.5వేల జరిమానా విధించారు.
మొత్తం నిందితుడికి 62 ఏండ్ల జైలు శిక్ష, రూ. 35వేల జరిమానా విధించడంతో పాటు బాధితురాలికి జిల్లా న్యాయ సేవా సంస్థ నుంచి రూ.3 లక్షలు పరిహారంగా చెల్లించాలని తీర్పు వెలువరించారు. ఈ కేసులో జీడిమెట్ల సీఐ గడ్డం మల్లేశ్ ఆధ్వర్యంలో విచారణ సిబ్బంది నిర్ణీత సమయానికి ముందే విచారణ పూర్తి చేసి చార్జీషీటు దాఖలు చేయగా, కోర్టు డ్యూటీ ఆఫీసర్ శ్రీనివాస్, లైజన్ ఆఫీసర్ మౌనిక, భరోసా లీగల్ అసిస్టెంట్ కల్యాణి బాధితురాలికి అండగా నిలిచారు. స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ప్రభాకర్‌రెడ్డి బలంగా వాదించి, కేసు నమోదైన ఏడాదిలోపే నిందితుడికి శిక్ష పడేలా చేశారు.