శంషాబాద్ రూరల్, జూన్ 11: కర్ణాటక నుంచి హైదరాబాద్కు తరలిస్తున్న రూ.18 లక్షల నకిలీ నోట్లను మంగళవారం స్వాధీనం చేసుకున్న శంషాబాద్ రూరల్ పోలీసులు, ఓ వ్యక్తిని కూడా అరెస్టు చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. ద్విచక్ర వాహనంపై వెళ్తున్న ఓ వ్యక్తి నకిలీ నోట్లను తరలిస్తున్నట్టు పోలీసులకు సమాచారం అందింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు హైదరాబాద్- బెంగళూరు జాతీయ రహదారిలో తొండుపల్లి వద్ద ఎస్ఐ భాస్కర్రావు ఆధ్వర్యంలో వాహనాల తనిఖీ చేపట్టారు. నంబర్ ప్లేట్ లేని ద్విచక్ర వాహనంపై తలకు హెల్మెట్ లేకుండా వస్తున్న ఓ వ్యక్తి.. పోలీసులను చూసి పారిపోయే ప్రయత్నం చేశాడు. అనుమానం వచ్చిన పోలీసులు అతడిని వెంబడించి పట్టుకున్నారు. అతడి వద్ద ఉన్న బ్యాగును తనిఖీ చేయగా.. అందులో నకిలీ రూ.500 నోట్లు.. 18 లక్షలు ఉన్నట్టు గుర్తించారు. దీంతో అతడిని అదుపులోకి తీసుకొని స్టేషన్కు తరలించి, పూర్తి వివరాలు సేకరించారు. నిందితుడు కర్ణాటకకు చెందిన మురుగేశ్ అని తేలింది. స్వగ్రామంలో కంప్యూటర్, జిరాక్స్ సెంటర్ నిర్వహిస్తున్న నిందితుడు అక్కడే నకిలీ నోట్లు కూడా ముద్రిస్తున్నాడని, ప్రింట్ చేసిన నోట్లను నంబర్ ప్లేట్లేని వాహనంపై తిరుగుతూ వేర్వేరు ప్రాంతాలకు తరలిస్తున్నాడని పోలీసుల విచారణలో వెల్లడైంది. అతడికి అతడి సోదరుడు రవిచంద్ర, సోదరుడి కుమారుడు యోగేశ్ సహకరిస్తున్నారని, ఈ నోట్లను హైదరాబాద్కు తరలిస్తున్నట్టు వెల్లడించాడు. దీంతో నిందితుడి నుంచి రూ.18 లక్షల నకిలీ నోట్లతో పాటు రూ.6,500 అసలు నోట్లు, ఫోన్, ద్విచక్ర వాహనం స్వాధీనం చేసుకున్నారు. నిండితుడిపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించారు.