కేపీహెచ్‌బీ కాలనీ, జూలై 26 : వసంతనగర్ కేంద్రంగా సాగుతున్న నకిలీ సర్టిఫికెట్ల తయారీ ముఠా గుట్టురైట్టెంది. ఈ సంఘటన కేపీహెచ్‌బీ కాలనీ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్నది. పోలీసుల వివరాల ప్రకారం.. ఏపీ, పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు ప్రాంతానికి చెందిన హరీశ్(32), మావూరి మహేశ్(33)లు కలిసి కేపీహెచ్‌బీ కాలనీ వసంతనగర్ కాలనీలో శ్రీవ్యాస కన్సల్టెన్సీ ప్రారంభించారు.
ఈ ఇద్దరు.. విజయవాడకు చెందిన మోహన్‌తో కలిసి ఉత్తర ప్రదేశ్‌లోని వీర్ బహదూర్ సింగ్ పూర్వాంచల్ యూనివర్సిటీ పేరుతో నకిలీ బీకాం, బీటెక్ సర్టిఫికెట్లను తయారు చేసి.. అవసరమైనవారికి అమ్ముతున్నారు. కాగా.. జగద్గిరిగుట్ట పాపిరెడ్డి నగర్ కాలనీకి చెందిన పోతూర్ సాయి వెంకట హర్షిత్ బీటెక్‌లో బ్యాక్లాగ్ సజ్జెక్టులు ఉండగా.. శ్రీవ్యాస కన్సల్టెన్సీని సంప్రదించారు. వారు.. రూ.3 లక్షలు తీసుకుని అతనికి వీర్ బహదూర్‌సింగ్ పూర్వంచల్ విశ్వవిద్యాలయం పేరుతో 2023 సెప్టెంబర్‌లో నకిలీ సర్టిఫికెట్లు అందజేశారు.
ఈ సర్టిఫికెట్లతో ఇంటర్వ్యూలకు హాజరు కాగా.. అవి నకిలీవని తేలింది. మళ్లీ 2024లో అమెరికా వెళ్లడానికి యత్నించగా.. వారు ఆ సర్టిఫికెట్లు నకిలీవని బయటకు పంపారు.. ఈ విషయంపై కన్సల్టెన్సీ నిర్వాహకులను ప్రశ్నించగా.. స్పందించకపోవడంతో బాధితుడు పోలీసులను ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టా రు.
దర్యాప్తులో శ్రీవ్యాస కన్సల్టెన్సీలో ఇప్పటివరకు 46 నకిలీ సర్టిఫికెట్లు తయారు చేయగా.. వీరిలో 24 మంది సర్టిఫికెట్లను పొందినట్లు తెలిసింది. మరో 22 మంది డబ్బులు చెల్లించకపోవడంతో వారికి సర్టిఫికెట్లు ఇవ్వలేదు. ఈ నకిలీ సర్టిఫికెట్లను పొందిన వారి లో 22 మంది అమెరికా, యూకే, ఐర్లాండ్ లాంటి విదేశాలను వెళ్లినట్లు తేలింది.. దీంతో కన్సల్టెన్సీ నిర్వాహకులు హరీశ్, మహేశ్‌లను పోలీసులు అరెస్ట్ చేయ గా.. మోహన్ పరారీలో ఉన్నాడు.